కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో నేడు తాగునీరు లేక ఆడబిడ్డలు బిందలతో రోడ్డెక్కుతున్నారని బీఆర్ఎస్ శాసనసభ విప్ కేపీ వివేకానంద (KP Vivekanand) అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని చెప్పిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నీళ్లు ఇచ్చాకనే ఓట్లు అడిగిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అద్భుతమైన ప్రగతి నివేదిక కార్యక్రమం చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి నివేదిక పేరుతో ప్రజలను వంచించే కాలం నడుస్తోందని విమర్శించారు. మొదటి దఫా తీసుకున్న దరఖాస్తులుతో కాలం గడిపారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా ఉన్న పథకాలు కూడా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని కూడా మంచి చేయడం లేదని.. ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని విమర్శించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమానికి నిధులు లేవని.. విధులు లేవని ఎద్దేవా చేశారు. 99 రోజుల ప్రణాళిక కాదు.. 900 రోజుల్లో కూడా ఎలాంటి హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పటివరకు అమలు చేయని హామీలుపై ఒక్కసారైనా సమీక్ష చేసుకున్నారా? విద్యాశాఖ సీఎం వద్దనే ఉన్నదని.. అంతా అయోమయంగా ఆగమాగంగా ఉందని చెప్పారు. హోమ్ శాఖ సైతం ముఖ్యమంత్రి వద్దనే ఉన్నది లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా గందరగోళంగా ఉన్నాయని.. ఆర్ధికంగా ఉన్నవారికే ఇండ్లు ఇస్తున్నారని ఆరోపించారు. స్వయంగా మంత్రి ముందే ‘నాకు కొడుకు లండన్‌లో ఉన్నాడు, నా బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి’ అని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా సరిగా లేక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్స్ పేలిపోతున్నాయని అయన విమర్శించారు. రాజీవ్ యువ వికాసం ప్రకటించి ఏడాది అయింది.. ఒక్కరికైనా అందిందా? అని ప్రశ్నించారు. రైతు భరోసా, రైతు బీమా ఇందిరమ్మ ఇండ్లు ఏది తీసుకున్న అరకొర తప్ప ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదన్నారు.
కేటీఆర్‌తో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగిందని.. ఈ మీటింగ్ లో SIR పై చర్చించడం జరిగిందని తెలిపారు.ఓటర్ నమోదు, పార్టీ సభ్యత్వం తదితర అంశాలపై కేటీఆర్ దగ్గర చర్చ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాధించిన కీర్తి కేసీఆర్‌ది అని కొనియాడారు. కేసీఆర్‌ను తెలంగాణ సమాజం మొత్తం పెద్ద దిక్కుగా భావిస్తారని చెప్పారు. కేసీఆర్‌పైన కవిత చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ సమాజం చీత్కరించుకుంటుందని విమర్శించారు. కవిత వ్యవహార శైలి తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుందని చెప్పారు. రాజకీయంగా కవితకు కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారని చెప్పారు. కవిత ఎవరిచేతిలో కీలుబొమ్మనో ప్రజలకు అర్థమైందని.. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అవకాశాలు కవిత నిలుపుకోలేకపోయారని విమర్శించారు.

