కలం, ఖమ్మం బ్యూరో : వర్షాకాల విపత్తులు, అత్యవసర పరిస్థితుల వేళ జిల్లా ప్రజలకు అభయమిస్తూ జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అలర్ట్ అయ్యింది. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయం, జీ–19 గదిలో 24×7 జిల్లా కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) శనివారం వెల్లడించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.
ఈ కంట్రోల్ రూమ్ నిర్వహణ కోసం ఆగస్టు 3, సోమవారం నుంచి వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని మూడు షిఫ్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు రెండో షిఫ్ట్, రాత్రి 9:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7:00 గంటల వరకు మూడో షిఫ్ట్ చొప్పున విధులను కేటాయించారు. కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ వివరించారు.
కంట్రోల్ రూమ్‌కు ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, తక్షణమే సంబంధిత శాఖలకు సమాచారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలను కూడా రిజిస్టర్లో స్పష్టంగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచినా, వాగులు-వంకలు పొంగిపొర్లిన వెంటనే సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో ముందస్తు చర్యలతో సహాయక కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు.
విధులకు కేటాయించిన అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా హాజరయ్యేలా శాఖాధిపతులు చర్యలు తీసుకోవాలని, ఎవరైనా సెలవులో ఉంటే వారి స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. అత్యవసర విధుల్లో నిర్లక్ష్యం వహించినా లేదా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వర్షాల వల్ల ఎలాంటి అత్యవసర సమస్యలు ఎదురైనా ప్రజలు 08744-241950 నంబర్ ద్వారా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ అంకిత్ కోరారు. ప్రజా రక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

