కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం గోధుమవాగు బ్రిడ్జీపై ఏర్పడిన గుంతల మరమ్మత్తు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని కొత్తగూడెం (Kothagudem) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ తెలిపారు. మంగళవారం ఆయన అధికారులతో కలిసి పనులను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి బ్రిడ్జీపై గుంతలు పడి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నా, ప్రమాదాలు జరుగుతున్నా నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం సరికాదన్నారు. వారి బాధ్యతారాహిత్యం వల్లే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి మున్సిపల్ శాఖ ద్వారా యుద్ధప్రాతిపదికన ఈ మరమ్మతు పనులకు ఆదేశించామన్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పనులను అత్యంత నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, కూరపాటి సుధాకర్, జి వెంకటేశ్వర్లు, నాయకులు ఎండి యూసుఫ్, ధర్మరాజు, పి సత్యనారాయణాచారి తదితరులు పాల్గొన్నారు.
గోధుమవాగు బ్రిడ్జీపై ముమ్మరంగా గుంతల మరమ్మత్తులు

