కలం, వెబ్ డెస్క్: వ్యాయామం.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు ఎక్సర్ సైజ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే, వ్యాయామం (Exercise) చేసే సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎక్సర్ సైజ్ చేసే సమయంలో ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం లేదా మూర్ఛ, విపరీతమైన అలసట, కీళ్లలో లేదా కండరాలలో విపరీతమైన నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపేయాలి. ఈ ఇబ్బందులను సాధారణంగా భావించి వదిలేయం ప్రమాదకరం అని నిపుణులు సూచిస్తున్నారు.
1. గుండె సంబంధిత సమస్యలు..
ఛాతీలో బరువుగా, పిండేస్తున్నట్లుగా, లేదా ఒత్తిడిలా అనిపించడం, తరచుగా ఎడమ చేయి, మెడ, దవడ, లేదా వీపుకు వ్యాపిస్తుండడం ప్రమాద సంకేతం. వ్యాయామం చేసేటప్పుడు లేదా ఎక్కువగా పని చేసినప్పుడు కండరాల నొప్పులు అని నిర్లక్ష్యం చేయకూడదు.
2. తీవ్రమైన ఆయాసం
ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు ఆయాసంగా అనిపించడం సహజం.. కానీ తేలికపాటి పనులు చేస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే గుండె సమర్థవంతంగా రక్తాన్ని సరఫరా చేయడం లేదని అర్థం. ఇది హార్ట్ ఫెయిల్యూర్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం లాంటి ఇతర గుండె సంబంధ సమస్యలకు సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
3. తల తిరగడం, మగతగా అనిపించడం..
న్యూరోలాజికల్ లక్షణాలు అని తల తిరగడం, మగత, స్పృహ కోల్పోవడం వంటివి రక్తపోటు తగ్గడం లేదా అసాధారణ హృదయ స్పందన రేటుకు సంకేతం కావచ్చు. దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అత్యవసర చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతన్నారు. హృదయ సంబంధ సమస్యలను గుర్తించకుండా లేదా చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రాణాలకు ముప్పుగా పరిణమిల్లే అవకాశం లేకపోలేదు.
4. తీవ్రమైన అలసట లేదా నీరసం
తేలికపాటి శారీరక శ్రమ చేస్తున్నప్పుడు లేదా చేసిన వెంటనే తీవ్రంగా అలసిపోయినట్లు అనిపిస్తే శరీరానికి సరైన రక్త ప్రసరణ జరగడం లేదని అర్థం. ఇలాంటి లక్షణాలు సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాయామం చేసేటప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వ్యాయామాన్ని ఆపి విరామం తీసుకోవాలి.

