కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో వివాదం అనంతరం తొలిసారి వరంగల్ నగరరానికి వచ్చిన ఆమె.. తన కూతురు సుస్మిత వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా నిరాకరించారు. ఈ విషయంలో తాను ఏం మాట్లాడబోనని స్పష్టం చేశారు. రంగసాయిపేటలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఓపెన్ జిమ్ కూడా ప్రారంభించారు.
ఎక్కడా కనిపించని పార్టీ నేతలు..
కొండా సురేఖ వరంగల్ పర్యటనలో ఆమె వర్గీయులు తప్ప పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎవరూ కనిపించకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సురేఖ నియోజకవర్గానికి వస్తున్నారంటే పార్టీ కేడర్ హడావిడి ఒక రేంజ్‌లో ఉంటుంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మంత్రి పర్యటనకు కావాలనే దూరంగా ఉన్నారా.. లేకపోతే పార్టీ నుంచే ఆదేశాలు వెళ్లాయా.. అనేది ఆసక్తికరంగా మారింది. అంతకుముందు మంత్రి సురేఖ రాగానే, ఆమె అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంఘీభావం ప్రకటించారు.
ఏఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ..
మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే పీసీసీ, క్రమ శిక్షణ కమిటీ నివేదికలను తెప్పించుకున్న అధిష్ఠానం.. తీసుకునే చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ అంశంపై నిన్న స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో హై కమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

