కలం, వెబ్ డెస్క్: శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ (Irumudi )సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. తండ్రి-కూతురు మధ్య ఉన్న భావోద్వేగ బంధంతో రూపొందిన ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తున్న వేళ ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (APTF) నాయకులు ఆగ్రహించారు.
ముఖ్యంగా చిత్రంలో ఉపాధ్యాయురాలి పాత్రను నెగెటివ్ కోణంలో చూపించారని APTF నాయకులు మంజుల, బసవ లింగారావు ఆరోపించారు. సినిమాల్లోని సన్నివేశాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పాఠశాల భవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అంతేకాకుండా విద్యార్థులకు వాడిన యూనిఫామ్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనిదేనని వారు తెలిపారు.
ఈ తరహా దృశ్యాలు సమాజంలో ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని తగ్గించడంతో పాటు, ప్రభుత్వం విద్యా వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని వారు ఆందోళ వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద సన్నివేశాలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరికలు జారీ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

