రూఫ్‌టాప్ సోలార్‌కు కేంద్రం భారీ ప్రోత్సాహం

కలం, కరీంనగర్: పేదలపై విద్యుత్ భారాన్ని తగ్గించడంతో పాటు కర్బన ఉద్గారాలు, వాతావరణ కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని అమలు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తెలిపారు. తెలంగాణలో ఈ పథకాన్ని జైవిక్ కంపెనీ భాగస్వామ్యంతో అమలు చేసేందుకు మారుతి ఏజెన్సీస్ ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, మారుతి ఏజెన్సీస్ నిర్వాహకుడు తిప్పారపు ఆంజనేయులు, సంస్థ ప్రతినిధులు దేవోజు వెంకటరమణాచారి, తిప్పారపు రవివర్మతో కలిసి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన (PM Surya Ghar Yojana) పోస్టర్లను బండి సంజయ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు సౌర విద్యుత్ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ సోలార్ పథకంగా అభివర్ణించారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి సగటున రూ.77,800 వరకు ఆర్థిక సహాయం అందుతుందని బండి సంజయ్ వివరించారు. ఒక కిలోవాట్ వరకు రూ.30 వేల సబ్సిడీ, రెండు కిలోవాట్లకు రూ.60 వేల సబ్సిడీ, మూడు కిలోవాట్లకు రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. సౌర విద్యుత్ ద్వారా కుటుంబాల విద్యుత్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించి లబ్ధిదారులు ఆదాయం పొందవచ్చని సూచించారు. పథకం ప్రయోజనాలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని మారుతి ఏజెన్సీస్ నిర్వాహకులను బండి సంజయ్  కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>