కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) ఖండించారు. శుక్రవారం చిట్ చాట్‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే.. ఊరూరా తిరుగుతున్నావ్. కవిత బీఆర్ఎస్‌లో ఉందా? బయట ఉందా ఏ పార్టీలో ఉంది స్పష్టం చేయాలి. తన తండ్రి మీద ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కవిత.. హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ వదిలిన బాణంగా కవిత అనిపిస్తుంది’’ అని కోమటిరెడ్డి అన్నారు.
‘‘కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న నాయకులు అందర్నీ దూరం చేసేందుకు విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్‌ను ఉరితీసినా తప్పు లేదన్న దానికి రక్తం మరిగిపోయిందన్న కవిత.. కేటీఆర్, హరీష్ రావు లను ఉరితిసినా తప్పు లేదా’’ అని కవితను కోమటిరెడ్డి ప్రశ్నించారు.
‘‘బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నావ్ అని కవిత విమర్శిస్తుంది. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని అంటుంది. కవిత బీఆర్ఎస్‌లో ఉన్నదా అనే అనుమానం ఉంది. కవిత కన్ఫ్యూజన్ లో ఉంది. జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకుంది. బీఆర్ఎస్ హాయాంలో నల్లగొండ మంత్రి జిల్లాకు చేసిన అన్యాయంపై కవిత (Kavitha) ప్రశ్నించాలి’’ అని కోమటిరెడ్డి సవాల్ విసిరారు.


