కలం, వెబ్ డెస్క్: వర్షాకాలంలో ప్రజల భద్రతే ప్రాధాన్యంగా ఆర్‌అండ్‌బి అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy ) ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాకాలం సందర్భంగా వరదల వల్ల రహదారులు, వంతెనలు, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలకు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు సమీక్ష నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను విడుదల చేసి మాట్లాడారు. వరద ముప్పు ప్రాంతాల్లో అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం యంత్రాలు, సామగ్రిని ముందుగానే సిద్ధం చేయాలన్నారు.
రెడ్ అలర్ట్ సమయంలో అందుబాటులో ఉండాలి..
రెడ్ అలర్ట్ సమయంలో 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. నష్టం జరిగిన 24 గంటల్లోపు పూర్తి నివేదికలు సమర్పించాలని చెప్పారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ నిబంధనల మేరకు నిధుల వినియోగానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే గుర్తించాలన్నారు. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. వర్షాకాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్&బీ శాఖ పూర్తి సన్నద్ధంగా ఉందని వివరించారు.

