భూకబ్జాల చుట్టూ తెలంగాణ రాజకీయం.. రేవంత్‌కు బీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్!

కలం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) నేతల భూకబ్జాలను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి బయటపెట్టడంతో ఆ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ అవుతుండడంతో కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్‌‌గా స్ట్రాటజీ రూపొందిస్తున్నారు. ‘ముల్లును ముల్లుతోనే తీయాలన్న..’ చందంగా భూకబ్జాల అంశంతోనే కాంగ్రెస్‌ను కార్నర్ చేయాలని భావిస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా కొందరు ఎమ్మెల్సీలు ఇదే అంశంపై రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని నెల రోజుల్లోగా వివరాలు సేకరించాలని టార్గెట్ నిర్దేశించుకున్నారు.

ఈ రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ నేతలు చేసిన భూకబ్జాలను వెలికితీయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు, కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, బినామీలు ఎక్కడెక్కడ? ఎంత భూమి? కబ్జా చేశారో సర్వే నెంబర్లు, విస్తీర్ణం సహా సమగ్ర వివరాలను సేకరించే పనిని మొదలుపెట్టారు. ఈ స్పెషల్ టీమ్ మాత్రమే కాకుండా.. ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ సేవలను సైతం ఇందుకోసం వినియోగించుకుంటున్నారు.

సైలెంట్ యాక్షన్

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోని భూకబ్జాల వ్యవహారాన్ని సీఎం వెలికితీస్తూ ఉంటే.. దానికి కౌంటర్‌గా వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నేతలు ఎంత కబ్జా చేశారో జనంలోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అయితే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ సహా బీఆర్ఎస్ భూకబ్జాలపై నెల రోజుల్లోగా రిపోర్టు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అప్పటిలోగా ఎలాంటి హడావిడి లేకుండా కాంగ్రెస్ నేతల భూకబ్జాల సమాచారాన్ని సేకరించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. కేటీఆర్, హరీశ్ నిర్వహించిన సీక్రెట్ మీటింగ్‌లో ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకున్నట్లు సమాచారం అందుతోంది.

అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించిన తర్వాత గ్రౌండ్‌లోకి వెళ్లి కాంగ్రెస్ లీడర్ల భూఆక్రమణలను జనంలో వివరించాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తున్నది. రెవెన్యూ డిపార్టుమెంట్ రిపోర్టుపై ప్రభుత్వం చర్యలు చేపట్టే సమయానికి కౌంటర్ వ్యూహంతో ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నది. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో నివేదికను రూపొందించుకున్న గులాబీ లీడర్లు.. సీఎం సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులపై మీడియా సమావేశాల్లో ఆరోపణలు చేశారు.

సీఎం, మంత్రులపై రిపోర్టు

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోని భూకబ్జాలను కాంగ్రెస్ వెలికితీస్తుంటే.. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలోని భూకబ్జాలను వెలికితీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సీఎం, మంత్రులు, వాళ్ల కుటుంబ సభ్యులు, బినామీల ఆస్తులపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ సమాచార సేకరణకు స్పెషల్ టీమ్‌తో పాటు థర్డ్ పార్టీ ఏజెన్సీని రంగంలోకి దించింది. బీఆర్ఎస్ భూకబ్జాలపై విచారణ జరిపి నెల రోజుల్లోగా రిపోర్టు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉండి, ఆ రిపోర్టు వచ్చాక కాంగ్రెస్ నేతల భూకబ్జాలను బయటపెట్టాలన్నది బీఆర్ఎస్ ప్లాన్‌గా కనిపిస్తున్నది.

సీఎం ఎందుకు వ్యక్తిగతంగా తీసుకున్నారు?

కల్వకుంట్ల కుటుంబం గురించి సీఎం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందన్నది కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు ఇప్పుడు మింగుడు పడని ప్రశ్నగా మారింది. వ్యక్తిగతంగా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్సీ నవీన్‌రావు.. ఇలాంటి వారిని ఎందుకు టార్గెట్ చేశారో సమాధానం దొరక్క ఆలోచనలో పడ్డారు. నిర్దిష్టంగా కారణాలేంటన్నది తెలియకపోవడంతో సీఎంను కూడా వ్యక్తిగతంగానే టార్గెట్ చేయాలని వీరు భావిస్తున్నారు. అందుకే ఫీల్డులో తిరుగుతున్న ప్రత్యేక బృందం సేకరించే వివరాలు కాంగ్రెస్‌కు ‘టిట్ ఫర్ టాట్’ తరహాలో ఉండాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే లక్ష రూపాయల పెట్టుబడి పెట్టిన కొండల్‌‌రెడ్డి కంపెనీకి వందల కోట్ల విలువైన భూముల్ని కట్టబెట్టారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. రెండు పార్టీలూ పోటాపోటీగా భూకబ్జాల వ్యవహారంపై ఫోకస్ పెట్టడంతో రాబోయే ఎన్నికల వరకు ఇది ప్రధాన ప్రచారాస్త్రంగా మారనున్నది. దీంతో ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో ప్రజలకు దగ్గరవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ధరణి వర్సెస్ భూభారతి, 22ఏ జాబితాలోని నిషేధిత భూములు, ఎవరి హయాంలో ఎన్ని ఎకరాల కబ్జా, ఎవరికెన్ని ఫామ్‌హౌజ్‌లు ఉన్నాయి.. ఇలాంటివే పార్టీలకు ఎజెండాగా మారనున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>