టీచర్ల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సమస్యల పరిష్కారం అంటూ ఉపాధ్యాయులు రోడ్లమీదకు రావద్దని, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం కొడంగల్ (Kodangal) జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవం (Teachers Day Event) సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని అన్నారు. తల్లిదండ్రులకంటే విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దనే ఎక్కువ సమయం గడుపుతారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్న ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

విద్యాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం గతంలో 28వ స్థానంలో ఉంటే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17వ స్థానానికి చేరుకుందంటే, ఇది ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైందని ప్రశంసించారు. ఈ రెండేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 88 వేలకు పెరిగిందంటే, ఈ విజయం ఉపధ్యాయులు, తెలంగాణ ప్రజలదని అభినందించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 95 శాతం అడ్మిషన్లు జరిగాయని, సాంకేతిక విద్యలో తెలంగాణ వేగంగా దూసుకెళ్తుందని సీఎం తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మరోమారు గుర్తు చేశారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందనే వాస్తవాన్ని నమ్మే విద్యా పరంగా తెలంగాణలో అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.

ఉపాధ్యాయులకు నా విజ్ఞప్తి ఒక్కటే..

“ఉపాధ్యాయులు రోడ్డు మీదకు రావొద్దు.. వారి సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో నేను ముందుకు వెళుతున్నా” నని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో 55 రోజుల్లో డీఎస్సీ ద్వారా 10,006 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసింది నిజం కాదా?, 25,950 టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేసింది నిజం కాదా ? మీరే ఆలోచించండి అంటూ ఉపాధ్యాయులను కోరారు. చిన్న వివాదం లేకుండా 34,706 మంది ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని ఆయన తెలిపారు.

317 జీవో సమస్యను పరిష్కరించాం

విద్యా కమిషన్ ఏర్పాటు చేసి మీ సమస్యలను పరిష్కరిస్తున్నామని, కె. కేశవరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించి విద్యాశాఖ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మరోవైపు ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. రాజకీయ నాయకులకు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు,
మీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం మార్చుకోవద్దు అని అన్నారు. మేం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చామని గుర్తు చేశారు.

ఒకే ఒక్క కుటుంబం 8 లక్షల కోట్లు అప్పులు చేసి మనపై రుద్ది వెళ్లిందన్నారు. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మీ సర్వీస్ ను 60 ఏళ్లకు పెంచారనీ, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్‌లో పెట్టి వెళ్లి ఆయన ఫామ్ హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్న ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రజా ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు చెల్లించిందనీ సీఎం తెలిపారు.

ఎప్పుడైనా, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ ఖర్చులతో విదేశాలకు పంపి విద్యా విధానం అధ్యయనం చేయించారా? తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించింది నిజం కాదా? అంటూ ఆయన ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు గుర్తింపు ఇవ్వాలని, వారిని గౌరవించాలని 123 మంది టీచర్లకు అవార్డులు తమ ప్రభుత్వం అందిస్తుందన్నారు.

నేనే మీ ప్రతినిధిగా సమస్యలను పరిష్కరిస్తా

రెండేళ్లు డెడికేటెడ్‌గా విద్యార్థుల కోసం పనిచేయండి, దేశ విద్యావ్యవస్థకు దిక్సూచీగా తెలంగాణాను తీర్చిదిద్దుదాం అంటూ సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. మనం చేస్తున్న మంచి పనులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అన్నారు. విద్యా శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాని, రెండేళ్లు నాకు సమయం ఇవ్వండి.. ఆర్థిక వెసులుబాటును బట్టి మీ సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. టీచర్లు రోడ్డెక్కితే రాష్ట్రానికి శుభసూచకం కాదని, రెండేళ్ల తరువాత మీరు ఆశించినట్లుగా సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికల పరీక్షలో ఎన్ని మార్కులు వేయాలో మీరే నిర్ణయించుకోండి అంటూ ఉపాధ్యాయులకు తెలియపరిచారు.

రాజకీయ నాయకుల ఉచ్చులో పడకండి

పదేళ్లు విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారనీ, విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిద్దామని పిలుపునిచ్చారు. అది మీ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందంటూ గుర్తు చేశారు. పాలిటెక్నిక్ విషయంలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. మిమ్మల్ని అడ్డుపెట్టుకుని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది చూస్తున్నారనీ, దయచేసి అలాంటివారి ట్రాప్‌లో పడొద్దొని సీఎం గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయనీ, ఎడ్యుకేషన్, స్కిల్స్, ఇన్నోవేషన్‌కు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>