కలం, స్పోర్ట్స్ : కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, లక్నో (KKR vs LSG) మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్‌కు వరుణ గండం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచే కోల్‌కతాలో కురుస్తున్న వర్షమే ఈ వార్తలకు కారణం. అయితే వాతావరణ రిపోర్ట్‌లు మాత్రం.. భయం అక్కర్లేదని చెప్తున్నాయి. ఉదయం నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షంతో అభిమానుల్లో ఆందోళన మొదలైనప్పటికీ, మ్యాచ్ సమయానికి వరుణుడు కరుణించబోతున్నాడనే తాజా అప్డేట్ ఊరటనిస్తోంది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్ వర్షార్పణం కావడంతో, ఈసారైనా పూర్తి ఆట చూడాలని ఆశిస్తున్న క్రికెట్ ప్రియులకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. నేడు కోల్‌కతాలో ఉదయం నుంచి నల్లటి మేఘాలు కమ్ముకుని జోరుగా వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, సాయంత్రం 7 గంటల తర్వాత వర్షం పడే సూచనలు ఏమాత్రం లేవు. రాత్రి వేళ ఆకాశం నిర్మలంగా ఉంటుందని, ఆట ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తాయని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
సున్నా శాతం వర్ష సూచనతో ఈసారి 40 ఓవర్ల పూర్తి మ్యాచ్‌ను ఎంజాయ్ చేయవచ్చని తెలుస్తోంది. ఇక జట్ల విషయానికి వస్తే, కేకేఆర్ తన హోమ్ గ్రౌండ్‌లో పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్, కీలక ఆటగాళ్ల నిష్క్రమణ తర్వాత సరికొత్త వ్యూహాలతో కేకేఆర్ బరిలోకి దిగుతోంది. మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ కూడా పక్కా ప్లానింగ్‌తో పాయింట్ల వేటకు సిద్ధమైంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలుకానుండగా, వాతావరణం సహకరించనుండటంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

