కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జయింట్స్ (KKR vs LSG )మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు బోణీ కొట్టని కోల్‌కతా నైట్ రైడర్స్ ఒకవైపు, విజయ పరంపరను కొనసాగించాలని చూస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ మరోవైపు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు, గెలుపు అవకాశాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
చారిత్రక రికార్డులను పరిశీలిస్తే లక్నో సూపర్ జెయింట్స్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 6 సార్లు తలపడగా, లక్నో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కోల్‌కతా కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. ప్రస్తుత ఫామ్ పరంగా చూసినా రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై పంత్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఆ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
బలాలు, బలహీనతలు
కోల్‌కతా జట్టు ప్రధానంగా బౌలింగ్ సమస్యలతో సతమతమవుతోంది. గత మ్యాచ్‌ల్లో కేకేఆర్ బౌలర్లు 200 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టు బలహీనతను ఎత్తిచూపుతోంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్నర్లు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాజిక్ చేయాల్సి ఉంది. మరోవైపు, లక్నో జట్టులో మహమ్మద్ షమీ, మయాంక్ యాదవ్‌లతో కూడిన పేస్ దళం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఇటీవలి కాలంలో పేసర్లకు సహకరిస్తుండటం లక్నోకు కలిసొచ్చే అంశం.
గట్టి పోటీ పక్కా
ప్రస్తుత పరిస్థితులు, ఆటగాళ్ల ఫామ్, హెడ్-టు-హెడ్ రికార్డులను బట్టి చూస్తే లక్నో సూపర్ జెయింట్స్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కేకేఆర్ జట్టులో కెమెరూన్ గ్రీన్, రింకూ సింగ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండటంతో హోమ్ గ్రౌండ్‌లో వారు ఏ క్షణమైనా పుంజుకునే అవకాశం ఉంది. మొత్తానికి నేటి పోరులో లక్నో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, కేకేఆర్ గట్టి పోటీనిస్తుందని భావించవచ్చు.

