కలం, వెబ్ డెస్క్: చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్ల విస్తరణ, భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్‌తో పాటు సికింద్రాబాద్ స్టేషన్ వద్ద మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని పేర్కొన్నారు. గతంలో పలుమార్లు విన్నవించినా పనులు ప్రారంభం కాకపోవడంతో పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Cherlapally Railway Terminal) రోడ్ల విస్తరణను ఎఫ్సీఐ గోడౌన్ రోడ్డు నుండి కొత్త స్టేషన్ వరకు రహదారిని 200 అడుగులకు విస్తరించాలని పేర్కొన్నారు. భరత్ నగర్ వైపు ఉన్న 30 అడుగుల రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని తెలిపారు. ఈసీ నగర్ నుండి MMTS ప్లాట్‌ఫాం వైపు ఉన్న రోడ్డును 100 అడుగుల వెడల్పు, 700 మీటర్ల పొడవున విస్తరించాలని ప్రస్తావించారు. పార్కింగ్ ఇతర అవసరాల కోసం కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, ఎంఎంటీఎస్ (MMTS) వైపు 2.70 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. రైల్వే శాఖ ఇప్పటికే రూ. 4 కోట్లు జమ చేసినందున, స్టేషన్‌కు నీటి కనెక్షన్ త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్ మెంట్ కోసం ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఆల్ఫా హోటల్ నుండి రథీఫైల్ బస్టాండ్ వరకు ఉన్న ఉత్తర టెర్మినల్ రహదారిని 120 అడుగులకు విస్తరించాలని లేఖలో కోరారు. ఇదే విషయాన్నిఇప్పటికే గతంలో ఉన్న ముఖ్యమంత్రికి, మీకు ఉత్తరం ద్వారా విషయం తెలియజేశానని.. అయినప్పటికీ ఈ విషయంలో ఇప్పటి వరకూ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. వెంటనే సమస్య పరిష్కరించి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణకు అన్ని రకాల సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On: Instagram

