కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి (Bhadradri) కొత్తగూడెం జిల్లాలోని, పాల్వంచకు సమీపంలో ఉన్న కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం పచ్చని చెట్లు, జలాలతో మినీ ఊటీని తలపిస్తోంది. ప్రకృతి ప్రేమికులను అలరిస్తోంది. వేసవి విడిదిగా పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. చల్లని గాలులతో సేద తీరాలనుకునే వారికి ఈ అభయారణ్యం మంచి ఎంపిక.
ఇదీ చరిత్ర
1962-64 సంవత్సరంలో కిన్నెరసాని ప్రాజెక్ట్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. కాలక్రమేనా ఈ ప్రాంతం సహజ సిద్ధమైన అందాలతో పర్యాటకశాఖ దృష్టిని ఆకర్షించింది. 1972లో దీనిని అధికారికంగా ఒక పర్యాటక కేంద్రంగా గుర్తించి, నాటి నుంచి నేటి వరకూ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేశారు. ఫలితంగా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలన్నా, వారాంతంలో కుటుంబంతోకలసి ఆహ్లాదంగా గడపాలన్నా పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా ప్రజలకు కూడా గుర్తొచ్చే పేరు కిన్నెరసాని అభయారణ్యం. పాల్వంచ రూరల్ పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం అటు ఆధ్యాత్మికతను, ఇటు ప్రకృతి సౌందర్యాన్ని మేళవించుకొని పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తోంది.
ఐలాండ్ స్పెషల్ అట్రాక్షన్
దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఐలాండ్ కిన్నెరసానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. అలాగే జింకల పార్కులోని జింకలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. జింకపిల్లల పరుగులు చిన్నారులను అమితంగా ఆకట్టుకుంటాయి. లేక్ వ్యూ పాయింట్ వద్ద నిలబడి చూస్తే కనిపించే దృశ్యం ఒక ఎత్తయితే, బోటులో ప్రయాణిస్తూ అలల గలగలల మధ్య అడవి అందాలను చూడటం మరో అనుభూతి. అద్దాల మేడ, గేట్లు తెరిచినప్పుడు డ్యాం నుంచి దూకుతున్న నీరు కూడా కన్నుల పండువగా ఉంటుంది. అడవిలోని జంతుజాలం, జీవ వైవిధ్యం గురించి వివరించే మ్యూజియం విజ్ఞానాన్ని పంచుతుంది.
వేసవి విడిది
పట్టణ కాలుష్యానికి దూరంగా చల్లని వాతావరణంలో గడపాలను కునేవారికి, కిన్నెరసాని సరైన గమ్యస్థానం. ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, పక్షుల కిలకిల రావాలా మధ్య ఇక్కడ గడిపే ప్రతి నిముషం మధుర జ్ఞాపకంగా మారుతుంది. అందుకే ఇది పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమైన పిక్నిక్ స్పాట్‌గా విరాజిల్లుతోంది.
సుమారు 635 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యంలో పులులు, చిరుతలు, అడవి పందులు వంటి జంతువులు ఉన్నాయి. కొండల మధ్య ఉన్న రిజర్వాయర్ చూస్తున్నంత సేపు చూడాలనిపిస్తుంది. సింగరేణి సంస్థ నిర్మించిన అద్దాల మేడ నుంచి జలాశయాన్ని చూడటం,అలాగే జింకల పార్కులో జింకలకు గడ్డి నోటికి అందించడం చాలా సరదాగా అనిపిస్తుంది. రిజర్వాయర్ మద్యలో మొసళ్ళు కూడా అప్పుడపుడు కనిపిస్తుంటాయి.
– హేమశ్రీ బాలు, టీచర్, కొత్తగూడెం

