కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) వాసులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రెండు ఆర్వోబీల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందల్వాయి, జానకంపేట్ గూడ్స్ షెడ్ల వద్ద ఆర్వోబీల నిర్మాణాలు చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే ఉన్నతాధికారులను కలసి పలుమార్లు విజ్ఞప్తులు అందించారు. ఈ మేరకు సానుకూల ప్రకటన వెలువడింది.
గెజిట్ నోటిఫికేషన్ జారీ..
జాన్కంపేట్ – నిజామాబాద్ వద్ద LC 190A, అలాగే ఇందల్వాయి–సిర్నాపల్లి మధ్య LC 198 వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణాలను “స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్” కింద గుర్తిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని ఎంపీ అర్వింద్ వెల్లడించారు. రైల్వే చట్టం -1989 లోని సెక్షన్ 2, క్లాజ్ (37 ఏ) ప్రకారం ఈ ప్రాజెక్టును జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కేంద్రం చేర్చడం ప్రాముఖ్యమైందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా తక్షణమే భూసేకరణ, పరిపాలన అనుమతులు త్వరితగతిన లభిస్తాయన్నారు. టెండర్లు, ప్రాజెక్ట్ అమలు వేగంగా పూర్తవుతుందని, కేంద్ర నిధుల సమీకరణ సులభమవుతుందన్నారు.
ట్రాఫిక్ తగ్గి.. కనెక్టవిటీ పెరిగి..
ఈ ఆర్వోబీల నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడి.. జిల్లా అభివృద్ధికి మరింత వేగం చేకూరుతుందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కనీసం 10 ఆర్వోబీల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, వాటి సాధనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌకర్యం, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరిన్ని లెవెల్ క్రాసింగ్‌లను ఆర్వోబీలుగా మార్పిడి చేయించేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అలాగే, అమృత్ భారత్ కింద రూ.53 కోట్లతో చేపడుతున్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎంపీ తెలిపారు. ఇటీవల నిజామాబాద్ మీదుగా నడిచే పలు రైళ్లను స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్చడంతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగిందన్నారు.

