24 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు.. కిడ్నాప్ కథ సుఖాంతం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలో బాలుడి కిడ్నాప్ కథ (Kidnapped Boy) సుఖాంతం అయింది. అపహరణకు గురైన బాలుడిని సంగారెడ్డి జిల్లాలో గుర్తించిన పోలీసులు సురక్షితంగా తీసుకొచ్చారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బాలుడిని తల్లిదండ్రులను అప్పగించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వివరించారు. ఈ నెల అయిదో తేదీన ఉదయం 10:30 గంటలకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రెండున్నరేళ్ల వయస్సు ఉన్న వేదాంష్‌ను చాక్లెట్లు కొనిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి అపహరించారు.

దౌల్తాబాద్‌లో ఉన్నాడని తెలిసి..

బాలుడి తల్లిదండ్రులు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం సీపీ ఆదేశాలతో ఒకటో పట్టణ స్టేషన్ పోలీసులు, సీసీఎస్, క్రైం టెక్నికల్ సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు సాంకేతికతతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ గ్రామంలో బాలుడు వేదాంష్ ఆచూకీని గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చారు.

తల్లిదండ్రులకు సీపీ హెచ్చరిక..

బాలుడిని అపహరించిన మెదక్ జిల్లా నిజాంపేట్ గ్రామానికి చెందిన కోతాడి ఎల్లం, కోతాడి సుజాతగా గుర్తించినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. వీరు మేడ్చల్‌లో నివాసం ఉంటున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించి బాలుడిని సురక్షితంగా రక్షించడంలో జిల్లా పోలీస్ బృందాల కృషి, సంగారెడ్డి పోలీసుల సహకారం ఎంతో కీలకంగా నిలిచిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. చాక్లెట్లు ఇస్తామంటూ వేదాంష్‌ని అపహరించిన ఘటనను ఉదహరిస్తూ.. పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>