కలం, వెబ్ డెస్క్ : ఇటీవల హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సు హత్యాచారానికి గురైన ఘటనను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. ఘటన (Nurse Rape-Murder Case) కు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.
ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, సంబంధిత సంస్థ నిర్వహణలో ఏవైనా నిర్లక్ష్యాలు ఉన్నాయా, మహిళా ఉద్యోగుల భద్రత విషయంలో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా అనే అంశాలన్నింటినీ విచారణలో పరిశీలించాలని సీఎం (CM Revanth Reddy) స్పష్టం చేశారు.
ఈ కేసులో ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తును అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. దర్యాప్తు, ఫొరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను వీలైనంత వేగంగా పూర్తి చేసి సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా కేసును పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించారు. కేసులో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించాలన్నారు.
న్యాయశాఖ, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి కేసు విచారణలో జాప్యం లేకుండా చూడాలని సీఎం సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్ భరోసానిచ్చారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ కేసులో నేరానికి పాల్పడిన నిందితుడికి చట్టప్రకారం శిక్ష పడేలా పకడ్బందీ దర్యాప్తు, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ జరగాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు. ఘటనకు కారణమైన వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి సరిదిద్దాలన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

