కలం, సూర్యాపేట: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు (Telangana) దక్కాల్సిన న్యాయబద్ధమైన వాటాను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) స్పష్టం చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలోని ఆర్-9 ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రైబ్యునళ్లు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)తో పాటు ప్రతి వేదికపై తెలంగాణ రైతుల జల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నీటిపారుదల, విద్యుత్ నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును చివరి ఆయకట్టు వరకు సమర్థవంతంగా చేరవేస్తున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో కొత్త ఆయకట్టును సృష్టించలేకపోయారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్టుల్లో వ్యయం భారీగా పెరిగినా.. క్షేత్రస్థాయిలో రైతులకు అందిన ప్రయోజనం ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం, వాస్తవ ఆయకట్టును సృష్టించడం, నీరు-విద్యుత్‌ను సమర్థవంతంగా నిర్వహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఆర్-9 ఎత్తిపోతల పథకం నిర్వహణను సమీక్షించిన ఆయన.. నీరు వృథా కాకుండా నేరుగా రైతుల పొలాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు విజయాన్ని కేవలం ఖర్చు చేసిన నిధుల ఆధారంగా కాకుండా, వాస్తవంగా సాగులోకి వచ్చిన ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగానే అంచనా వేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

