కలం, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక (Khanapur Municipal Election) ఆదివారం జరుగనుంది. నిన్నటి గందరగోళానికి ఇవాళ తెరపడే ఛాన్స్ ఉండటంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గెలుపు వ్యుహల్లొ నేతలు బిజిబిజీగా మారారు. మరికొన్ని గంటల్లో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే 7 మంది సభ్యుల (మ్యాజిక్ ఫిగర్) మద్దతు ఉండాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాలుగు, బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్ అఫీషియో సభ్యుడి ఓట్లతో కలిపి కాంగ్రెస్ బలం 5కు చేరింది. శనివారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుగా బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించాడు. దీంతో అధికారులతో ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులను ఆయన బెదిరిస్తున్నారని ఆక్షేపించారు. అటు ముందుగా బీజేపీ అభ్యర్థిని ఎలా ప్రతిపాదిస్తారంటూ ఎమ్మెల్యే బొజ్జు ఆందోళనకు దిగారు. ఈ ఎన్నికతో బీఆర్ఎస్- బీజేపీ బంధం బయటపడిందన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది.

