Mobile Popup Ad
Mobile Popup Ad

వింబుల్డన్‌లో ఫిలిప్పీన్స్ సునామీ.. ఎవరీ అలెగ్జాండ్రా ఈలా?

క‌లం, స్పోర్ట్స్ బ్యూరో: వింబుల్డన్ (Wimbledon) చరిత్రలో 21 ఏండ్ల ఫిలిప్పీన్స్ (Philippines) అమ్మాయి అలెగ్జాండ్రా ఈలా (Alexandra Eala) సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరైన ఇగా స్వియాటెక్‌ను 7-6(9), 6-2తో ఓడించి ఒక్కసారిగా గ్లోబల్ టెన్నిస్ దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఒక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నాలుగో రౌండ్‌ (ప్రీక్వార్టర్స్) చేరిన మొట్టమొదటి ఫిలిప్పీన్స్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

అలెగ్జాండ్రా ఈలా ఆటలోనే కాదు.. ఆమె ఆలోచనల్లోనూ గెలిచే కసి కనిపిస్తుంది. ఆమె ధరించే క్యాప్‌పై ఫిలిప్పీన్స్ అధికారిక భాషలో ఒక కోట్ రాసి ఉంది. దాని అర్థం.. ‘‘ఒక్కసారి ఇది పెరగడం మొదలైతే, దీన్ని ఎవరూ ఆపలేరు.’’ సరిగ్గా అదే నమ్మకంతో ఇప్పుడు కోర్టులో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నది.

రాఫెల్ పర్యవేక్షణలో రాటుదేలి..

టెన్నిస్‌లో రాణించాలనే కసితో 13 ఏండ్ల వయసులోనే స్పెయిన్‌కు వెళ్లిన ఈలా.. అక్కడి ప్రసిద్ధ రాఫెల్ నాదల్ అకాడమీలో చేరింది. నాదల్ పర్యవేక్షణలోనే అత్యంత కఠినంగా రాటుదేలింది. లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ కావడం ఇలాకు అతిపెద్ద అడ్వాంటేజ్. లెఫ్ట్ హ్యాండ్‌తో ఆమె సంధించే స్పిన్, విభిన్న కోణాల షాట్లను అంచనా వేయలేక ప్రత్యర్థులు తలకిందులవుతున్నారు. చురుకైన ఫుట్వర్క్, పటిష్టమైన గ్రౌండ్స్ట్రోక్స్, బ్యాక్హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేయడం ఇలా ప్రత్యేకత. ఈ వ్యూహాలతోనే గ్రాస్ కోర్టుపై బంతి తక్కువ ఎత్తులో బౌన్స్ అయ్యేలా స్లైస్ షాట్లను ఉపయోగిస్తూ.. ఇగా స్వియాటెక్ వంటి దిగ్గజాల రిథమ్‌ను పూర్తిగా దెబ్బతీసింది.

వార్ వన్ సైడ్ చేసేసింది

ఈ టోర్నీలో తొలి రౌండ్ నుంచే ఈలా సూపర్ ఫామ్‌లో ఉంది. మొదటి రౌండ్‌లో మెక్సికోకు చెందిన రెనాటా జరాజువాను (6-1, 6-2) వరుస సెట్లలో నాకౌట్ చేసింది. రెండో రౌండ్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మాయా జాయింట్ తో జరిగిన మ్యాచ్‌లో మొదటి సెట్ (3-6) చేజారినప్పటికీ.. తిరగబడి 6-2, 6-0తో కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. ఇక మూడో రౌండ్‌లో ఇగా స్వియాటెక్ పై చూపిన గుండె నిబ్బరం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 90 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్ టైబ్రేకర్‌లో సెట్ పాయింట్‌ను కాపాడుకుని, రెండో సెట్‌ను 6-2తో ఏకపక్షంగా ముగించి స్వియాటెక్‌ను ఇంటి బాట పట్టించింది.

‘‘ఎన్నో గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఇగా స్వియాటెక్, సెరెనా విలియమ్స్ లాంటి దిగ్గజాలకు ఈ విజయం చాలా చిన్నదిగా అనిపించవచ్చు.. కానీ, టెన్నిస్ మ్యాప్‌లోనే లేని ఫిలిప్పీన్స్ లాంటి చిన్న దేశంలో, ఎన్నో కష్టాల మధ్య పెరిగిన నాబోటి సాధారణ అమ్మాయికి మాత్రం.. ఈ గెలుపే ప్రపంచం, సర్వస్వం!’’

– స్వియాటెక్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత సెంటర్ కోర్టులో అలెగ్జాండ్రా చెప్పిన ఈ మాటలు స్టేడియంలోని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>