ఖాకీ ముసుగులో ‘బ్లాక్‌మెయిల్’ దందా.. ఖమ్మం మహిళా పీఎస్‌లో సీఐ రాజు నాయక్ నేరవ్యూహలు!

కలం, ఖమ్మం బ్యూరో: బాధిత మహిళలకు అండగా నిలవాల్సిన పోలీస్ స్టేషన్ కాసుల కక్కుర్తికి, బ్లాక్‌మెయిలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన అధికార్లే, కొందరు దళారులను వెంటేసుకుని ‘ప్రైవేటు సైన్యం’గా మార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మహిళా పోలీస్ స్టేషన్ (Khammam Woman Police) మాజీ ఎస్‌హెచ్‌ఓ, సీఐ భూక్యా రాజు నాయక్‌పై వస్తున్న వరుస ఆరోపణలు, నమోదైన కేసులు ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. రాజు నాయక్ ఖమ్మంలోని మహిళా పోలీస్ స్టేషన్ కు ఎస్‌హెచ్‌ఓగా ఉన్న సమయంలో స్టేషన్‌ను ఒక వ్యాపార కేంద్రంగా మార్చారని, “లీగల్ అసోసియేట్స్” అనే ముసుగులో కొందరు మధ్యవర్తులు, బ్రోకర్లను చేరదీసి ఒక సమాంతర వసూళ్ల సామ్రాజ్యాన్ని నడిపారని బాధితులు ఆరోపిస్తున్నారు.

​భార్యాభర్తల గొడవలతో స్టేషన్‌కు వచ్చే కేసులను చట్టప్రకారం పరిష్కరించడం పక్కన పెట్టి, వారి బలహీనతలను పెట్టుబడిగా మార్చుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భార్యాభర్తలు రాజీ పడిన కేసుల్లో సైతం భార్యలకు లేనిపోని మాయమాటలు చెప్పి, పెద్ద మొత్తంలో భరణం ఇప్పిస్తామని నమ్మబలికేవారని తెలుస్తోంది. అలగే బ్రోకర్ల ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయించడం, తమ సొంత మనుషులతో దొంగ సాక్ష్యాలు సృష్టించడం ఇక్కడ పరిపాటిగా ఉండేదట.

అంతేకాకుండా అమాయకులైన భర్తలపై సెక్షన్ 498-A కింద కేసులు నమోదు చేసి, కనీసం స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం గానీ, కేసు నమోదైన సమాచారం గానీ వారికి తెలియకుండా దాచిపెట్టేవారట. దాదాపు ఏడాది గడిచిన తర్వాత, సదరు లీగల్ అసోసియేట్స్ బ్రోకర్లను రంగంలోకి దించి, కేసుల పేరిట భయభ్రాంతులకు గురిచేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసే వ్యూహం అమలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదైనా చట్టప్రకారం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకుండా, నెలల తరబడి పెండింగ్‌లో ఉంచి నిందితులను మానసికంగా, ఆర్థికంగా వేధించడమే ఈ ముఠా ప్రధాన వృత్తిగా మార్చుకున్నట్లు సమాచారం.

​ఇదిలా ఉంటే, సదరు అధికారి అక్రమాలు కేవలం ఆర్థిక వసూళ్లకు మాత్రమే పరిమితం కాలేదు, అంతకుమించి మహిళా రక్షణకే మచ్చ తెచ్చేలా సాగాయని ఒక వివాహిత ఉదంతం నిరూపిస్తోంది. 2023లో తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక వివాహితను సీఐ రాజు నాయక్ టార్గెట్ చేశాడు. బాధలో ఉన్న మహిళ ఫోన్ నంబర్ తీసుకుని, ఓదార్పు పేరిట మాటలు కలిపి, ప్రేమ-పెళ్లి పేరుతో నమ్మబలికాడు. నమ్మించి లోబరుచుకుని, సహజీవనం చేస్తూ ఆమెను గర్భవతిని చేశాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తేవడంతో బలవంతంగా గర్భస్రావ మాత్రలు మింగించి అబార్షన్ చేయించడమే కాకుండా, ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశాడు. ఈ దారుణంపై సదరు మహిళ ధైర్యంగా ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో సీఐ రాజు నాయక్ అసలు రంగు బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది.

​బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు సీఐ రాజు నాయక్‌ను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు నమోదైనప్పటి నుండి సదరు సీఐ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉంటూ, తెరవెనుక చక్రం తిప్పి రెండు రోజుల క్రితమే ముందస్తు బెయిల్ పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆయన స్థానంలో మరొక అధికారిని నియమించినప్పటికీ, రాజు నాయక్ హయాంలో జరిగిన అన్యాయాలపై విచారణ జరపాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ​అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో, ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని రాజు నాయక్ సృష్టించిన అరాచకాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని బాధితులు రాష్ట్ర డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన హయాంలో మహిళా పీఎస్‌లో నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లపై పునర్విచారణ జరిపించాలని, “లీగల్ అసోసియేట్స్” పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సెటిల్‌మెంట్లు చేసిన బ్రోకర్ల ముఠాను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే ఇలాంటి ‘ఖాకీ’ల వెనుక ఉన్న ప్రైవేటు నెట్‌వర్క్‌ను పూర్తిగా బద్దలు కొట్టాలని, ఈ ఆర్థిక దోపిడీపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు జిల్లా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>