కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) గ్రేటర్ నగర పరిధిలోని భవన నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో పాటిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేస్తామని హనుమకొండ జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారిణి చాహత్ బాజ్‌పాయ్ ప్రకటించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మంగళవారం ప్రశాంత్‌నగర్, అశోక్ కాలనీ, సిద్ధార్థ్‌నగర్, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భవన యజమానులు సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించడంతో పాటు నిర్మాణాలకు సంబంధించిన కొలతలను తనిఖీ చేశారు.
పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన..
అనంతరం బల్దియా ప్రత్యేకాధికారిణి చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ అనుమతులకు అవసరమైన పత్రాలు, సాంకేతిక ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు పూర్తిగా అమలు చేసిన తర్వాత మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. నగర అభివృద్ధి, ప్రజల భద్రత దృష్ట్యా నిర్మాణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అనుమతుల కోసం సమర్పించిన దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలిస్తున్నామని వివరించారు. ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించాకే తుది అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, టీపీఎస్ అవినాష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

