కలం, ఖమ్మం బ్యూరో: రోడ్లపై కేజ్ వీల్స్ (ఇనుప చక్రాలు) అమర్చిన ట్రాక్టర్లను నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Khammam Police) హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రభుత్వం ఎంతో వ్యయంతో నిర్మిస్తున్న రహదారులను సురక్షితంగా ఉంచడం అందరి బాధ్యతన్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం కేజ్ వీల్స్ వాడినప్పటికీ, పొలాల్లో పని ముగిసిన వెంటనే వాటిని తొలగించి సాధారణ టైర్లు వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి – రుద్రాక్షపల్లి మధ్య గల ఆర్ అండ్ బీ రోడ్డుపై కేజ్ వీల్స్‌తో ట్రాక్టర్లు నడుపుతూ రోడ్లను తీవ్రంగా దెబ్బతీస్తున్నారనే అధికారుల ఫిర్యాదుపై పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు, యజమానులైన సారా కృష్ణ, పమ్మి కృష్ణయ్య, గుత్తి ముత్యాలరావు, బోసి కొర్రాజులపై సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. అలాగే, క్షేత్రస్థాయిలో ట్రాక్టర్ యజమానులకు, డ్రైవర్లకు దీనిపై అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

