ఆధునిక సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట: సీపీ గౌష్ ఆలం

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చేపడుతూనే.. ఆధునిక సాంకేతితతో నేరాలకు అడ్డుకట్ట వేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో తొలి అర్ధ వార్షిక నేరాల సమీక్షలో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. 2025, 2026 సంవత్సరాల నేరాల గణాంకాలను సీపీ పోల్చి విశ్లేషించారు. నేరాల పెరుగుదల, తగ్గుదలకు గల కారణాలపై చర్చిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు.

వేగంగా దీర్ఘకాలిక కేసుల పరిష్కారం..

పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులతో పాటు 2024 వరకు పెండింగ్‌లో ఉన్న దీర్ఘకాలిక కేసులను వేగంగా పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. నిర్దేశిత 60, 90 రోజుల్లోగా ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం, పోక్సో చట్టం, మహిళలపై జరుగుతున్న నేరాల దర్యాప్తు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆస్తి సంబంధిత నేరాల ఛేదనలో వేగం పెంచాలని, చోరీకి గురైన సొత్తును బాధితులకు త్వరగా రికవరీ చేసి అందించాలని సూచించారు.

సైబర్ నేరాలపై దర్యాప్తు ముమ్మరం..

సైబర్ నేరాల నమోదు, దర్యాప్తులో వేగం పెంచాలని, NCRP ఫిర్యాదులను తక్షణమే ఎఫ్‌ఐఆర్‌లుగా మార్చాలని సీపీ ఆదేశించారు. మొబైల్ చోరీల అదుపునకు CEIRపోర్టల్ వినియోగాన్ని మరింత ముమ్మరం చేయాలన్నారు. దర్యాప్తులో NATGRID, సమన్వయ, గాండీవ, సుదర్శన్ వంటి అత్యాధునిక సాంకేతిక వేదికలను ఉపయోగించుకోవాలన్నారు. CCTNS-2.0, ఈ-సాక్ష్య, ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదును సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

డ్రగ్స్ కేసుల్లో ఉక్కుపాదం..

NDPS కేసులపై ఉక్కుపాదం మోపాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటూ యువతలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి సరిదిద్దాలని, హిట్ అండ్ రన్ కేసులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరుస్తూ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలన్నారు.

గ్యాంబ్లింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు..

అక్రమ పీడీఎస్ బియ్యం రవాణా, ఇసుక మాఫియా, గ్యాంబ్లింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ గౌష్ ఆలం ఆదేశించారు. రాత్రి గస్తీని పెంచాలని, ప్రజావాణి, డయల్-100 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులు, నేపాలీ పౌరుల డేటాను సేకరించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే ప్రథమ కర్తవ్యమన్నారు.

ప్రతి కేసును శాస్త్రీయంగా దర్యాప్తు చేసి, నిందితులకు శిక్ష పడేలా ఈ-సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలును వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్ జి, వేణుగోపాల్ , యాదగిరిస్వామి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>