మొబైల్ పోయిందా? CEIR ఉందిగా!

కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ (CEIR Portal) ఖమ్మం (Khammam) జిల్లాలో దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందించడంలో సమర్థవంతంగా పనిచేస్తోంది. ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రికవరీ చేసిన మరో 17 విలువైన మొబైల్ ఫోన్లను శుక్రవారం వన్‌టౌన్ సీఐ కరుణాకర్ బాధితులకు స్వయంగా అప్పగించారు. దీంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు మొత్తం 613 మొబైల్ ఫోన్లు ట్రేస్ చేసి రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ కరుణాకర్ మాట్లాడుతూ.. వన్‌టౌన్ పోలీస్ సిబ్బంది, జిల్లా ఐటీ కోర్ టీమ్ సమన్వయంతో CEIR Portal, IMEI ట్రాకింగ్ సాంకేతికతను ఉపయోగించి దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పోయిన మొబైల్‌లో కొత్త సిమ్ కార్డు వేసి ఆన్ చేసిన వెంటనే CEIR వ్యవస్థ ద్వారా ఐటీ బృందానికి సమాచారం చేరుతుందని, ఆ సమాచారంతో ఫోన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి రికవరీ చేస్తున్నామని తెలిపారు.

నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాకుండా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఆర్థిక లావాదేవీలకు కీలకమని సీఐ పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, లేదా కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు సూచించారు. త్వరితగతిన ఫిర్యాదు చేస్తే ఫోన్ రికవరీ అయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>