పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. ఖమ్మంలో సన్నాహక భేటీ!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం కంచుకోటలో మరోసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం తథ్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం–నల్గొండ–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయం నల్లేరు మీద నడకలా సాగుతుందని, తొలి ప్రాధాన్య ఓటుతోనే భారీ మెజారిటీ సాధించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.

శనివారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాం రెడ్డి, అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డితో కలిసి ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం సాధించడంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ అత్యంత కీలకమని, రాబోయే నవంబరు 6లోగా ఈ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు గ్రామాగ్రామాన పట్టభద్రుల సహకారంతో ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదును విస్తృతంగా చేపట్టాలన్నారు. యువత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి 95 శాతం పోలింగ్ సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కోరారు.

​రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇప్పటివరకు 75 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని, త్వరలోనే మరో 14 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పెండింగ్ బకాయిలను చెల్లించామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయని తెలిపారు.

నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను పట్టభద్రులు గమనించి తిప్పికొట్టాలని, పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా శ్రమించి అభ్యర్థికి అఖండ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>