కలం, నిజామాబాద్ బ్యూరో: మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల (Induru Tirumala) క్షేత్రంలో పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా మూడు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. మొదట స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయంలోని కొలను వద్దకు తీసుకెళ్లి కార్తీక దీపారాధన మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు దివ్య ఔషధ ప్రసాదాన్ని అందజేశారు. తల్లీబిడ్డల క్షేమం కోసం ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి తెలిపారు.
అలాగే సంవత్సరంలో ఒక్కసారి కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే అందించే ఆస్తమా నివారిణి ఔషధ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ ఔషధ ప్రసాదం ఆస్తమా రుగ్మతను పూర్తిగా నివారిస్తుందని ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డితో పాటు అర్చకులు సంపత్ కుమార్ ఆచార్యులు, రోహిత్ కుమార్ ఆచార్యులు, నర్సారెడ్డి, రమేష్, నరాల సుధాకర్, భాస్కర్, మురళి, రాము తదితరులు పాల్గొన్నారు.

