గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై పిల్లలకు అవగాహన కల్పించాలి: న్యాయమూర్తి

కలం, ఖమ్మం బ్యూరో: తల్లి కోడి తన రెక్కల కింద పిల్లలను పెట్టుకుని ప్రమాదాల నుండి ఎలా కాపాడుకుంటుందో, సమాజంలో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను అదే రీతిలో ప్రేమతో, బాధ్యతతో సంరక్షించాలని ఖమ్మం (Khammam) జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

​ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థులకు చిన్ననాటి నుంచే చట్టాలు, ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ గురించి సరైన రీతిలో విడమరిచి చెప్తూ, అనుచిత స్పర్శను గుర్తించి వెంటనే తల్లిదండ్రులు, టీచర్లకు తెలిపేలా వారిలో ధైర్యాన్ని నింపాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో భయం, ఆందోళన వంటి అసాధారణ మార్పులు కనిపిస్తే ఉపాధ్యాయులు నిశితంగా గమనించి స్నేహపూర్వకంగా మసలుకోవాలని, చైల్డ్ కేర్ అధికారులు బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, వేధింపులపై తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు.

​జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ, మారిన డిజిటల్ యుగంలో బాలల సమస్యలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయని, అధికారులు చట్ట పరిధిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో జువైనల్ జస్టిస్ యాక్ట్, పోక్సో వంటి చట్టాలను బాధ్యతాయుతంగా అమలు చేస్తూ ప్రతి బిడ్డకూ సురక్షితమైన వాతావరణం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, జిల్లా బాల సంరక్షణ అధికారిణి విష్ణు వందన, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>