కలం, ఖమ్మం బ్యూరో : గణేశ్ నిమజ్జన శోభాయాత్ర వేళ నగరంలో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ఒక పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కుమారుడిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో, సమయానికి వైద్యం అందక రెండేళ్ల బాలుడు కన్నుమూసిన హృదయవిదారక సంఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.
స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎస్టీ కాలనీకి చెందిన భూక్యా సైదులు, విజయలక్ష్మి దంపతుల రెండేళ్ల కుమారుడు వైభవ్ జ్వరంతో అల్లాడిపోతున్నాడు. దీంతో బాలుడికి వైద్యం అందించేందుకు తల్లిదండ్రులు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో, మెరుగైన చికిత్స కోసం నగరంలోని మరొక ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరారు.
అదే సమయంలో ఖమ్మం (Khammam) వీధుల్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సాగుతుండటంతో రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఆసుపత్రికి వెళ్లే మార్గంలో తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. బాలుడి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కంగారుపడిన తండ్రి సైదులు, కదిలే దారి లేక బాలుడిని తన భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రి వైపు పరుగు తీశాడు. తీవ్ర శ్రమకోర్చి ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ, మార్గమధ్యలోనే ఆలస్యం కావడంతో బాలుడు వైభవ్ అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

