ఖైరతాబాద్ త్రిముఖ పోరు: ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు!

కలం, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఉప ఎన్నిక (Khairatabad Bypoll)లో పోటీ చేయడానికి దానం నాగేందర్ రెడీ అయ్యారు. ‘పోటీ చేస్తున్నా.. కచ్చితంగా గెలుస్తా.. మంత్రినవుతా..’ అంటూ ఇప్పటికే అనుచరులకు క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున తలసాని సాయికిరణ్ యాదవ్ పోటీ దాదాపు ఫైనల్ అయింది. బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేరు కూడా దాదాపు ఖరారైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ ఫేస్‌లను రంగంలోకి దించుతున్నాయి. బీజేపీ మాత్రం రెడ్డిని నిలబెట్టనున్నది.

మూడు పార్టీల క్యాండిడేట్లు ఎవరనేది పబ్లిక్‌లోకి వెళ్లడంతో ఇప్పుడు ఎవరిని విజయం వరిస్తుందన్నది కీలకంగా మారింది. ఎలాగూ రెండేళ్ల కాలానికే కావడంతో ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది? ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? ఎవరికి పట్టం కడతారు? అనేది నిర్ణయాత్మక అంశాలు కానున్నాయి. ఇప్పటికే ఆరుసార్లు గెలిచిన దానం నాగేందర్.. 2004లో పార్టీ మారినందుకు రిజైన్ చేశారు. ఉప ఎన్నికలో ఓడిపోయారు. ఇప్పుడు మరో ఉప ఎన్నిక వస్తున్నది. ఫలితంపై ఆయనకు అనుమానం లేకపోయినా సెంటిమెంట్ ఎలా ఉంటుందన్న చర్చ ఊపందుకున్నది.

నాలుగైదు నెలలు ప్రచారం

ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక ఖాయమని తేలిపోవడంతో ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అభ్యర్థి సంగతి ఎలా ఉన్నా పార్టీ పరంగా విజయం సాధించాల్సిందేనని లక్ష్యం పెట్టుకున్నాయి. ఆరు నెలల గడువు ఉన్నందున ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసే షెడ్యూల్ వరకు ఆగకుండా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి వ్యూహాల రూపకల్పన అమలుపై దృష్టి పెట్టనున్నాయి.

ఉప ఎన్నిక అంటే ఎప్పుడైనా నెల రోజుల హడావిడి ఉండడం సహజం. కానీ ఈసారి కనీసం నాలుగు నెలల పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ తప్పేలా లేదు. ఇక్కడి గెలుపు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో అటు టైమ్‌కు, ఇటు ఖర్చుకు వెనుకాడడం లేదు. ప్రతి ఎన్నికలో అభ్యర్థి తానే అనే తీరులో ప్రచారం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైమ్‌లోనూ ప్రతి డివిజన్‌లో రోడ్ షో, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేశారు. మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పారు.

ఓటర్ల జాబితా తర్వాతే స్ట్రాటజీ

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ జరుగుతున్నందున నవంబరు సెకండ్ వీక్‌లో విడుదలయ్యే ఫైనల్ ఓటర్ లిస్టు అన్ని పార్టీలకూ కీలకం. మూడింట ఒక వంతు ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ లిస్టులో మాయం కావడంతో తుది జాబితాలో ఎవరి పేరు ఉంటుందో.. మొత్తం ఓటర్లు ఎంతమందో.. తేలనున్నది.

అప్పుడు ఖైరతాబాద్ పరిధిలో నివసిస్తున్న వారిలో ఓటర్లు ఎందరు, కానివారు ఎంతమంది.. అనేది స్పష్టమవుతుంది. దానికి అనుగుణంగానే బూత్‌ల వారీగా ఇన్‌చార్జిల నియామకం, వారిని కోఆర్డినేట్ చేసే వ్యవస్థను రూపొందించడం, మానిటరింగ్ చేయడానికి సీనియర్లను నియమించడం, ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు క్యాంపెయిన్ స్ట్రాటెజీని అమలు చేయడం.. ఇవన్నీ డిసైడ్ అవుతాయి. తుది ఓటర్ల జాబితా విడుదల వరకు జరిగే ప్రచారం ఒక తీరులో ఉంటే.. ఆ తర్వాత మరో రూపు తీసుకోనున్నది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>