కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు గర్జన సభ నేపథ్యంలో, డివైడర్లపై నాటిన మొక్కలకు గులాబీ జెండాలు (BRS Flags) కట్టడం చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని డివైడర్ల మధ్యలో కోనోకార్పస్ మొక్కలను నాటారు. ఈ మొక్కలు ప్రజల ఆరోగ్యానికి హానికరమనే అభిప్రాయాలతో ఇటీవల మున్సిపల్ అధికారులు వాటిని తొలగించి కొత్త మొక్కలను నాటారు.
ఈ నెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు గర్జన మహాసభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శివాజీ చౌక్ నుంచి వివేక్ చౌక్ వరకు డివైడర్ల మధ్యలో ఉన్న మొక్కలకు పార్టీ నేతలు గులాబీ జెండాలు కట్టారు. దీంతో రహదారి పొడవునా మొక్కలన్నీ గులాబీ జెండాల(BRS Flags)తో దర్శనమిస్తున్నాయి. అయితే కొత్తగా నాటిన మొక్కల కొమ్మలు చిన్నవిగా ఉండగా, వాటికి కట్టిన జెండాలు పెద్దవిగా ఉండటంతో గాలికి జెండాలు ఊగుతూ మొక్కలు వంగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొన్ని చోట్ల జెండాల బరువుకు కొమ్మలు విరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్షలాది రూపాయల ప్రజాధనంతో మొక్కలు నాటిన మున్సిపల్ అధికారులు వాటి సంరక్షణపై మాత్రం శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొక్కల పెరుగుదలకు ఇబ్బంది కలిగించేలా జెండాలు కట్టినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రచారానికి మొక్కలను వేదికగా మార్చడం కంటే వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : షేక్ హసీనా కీలక నిర్ణయం.. కేంద్రానికి దరఖాస్తు!
Follow Us On : WhatsApp

