కలం, ఖమ్మం బ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) ప్రజా దివాస్ నిర్వహించారు. స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక లావాదేవీలు అలాగే భార్యభర్తల మధ్య తగాదాల ఫిర్యాదులు వచ్చాయి. బాధితులు చెప్పిన సమస్యలను సీపీ సునీల్ దత్ విని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం సంబంధిత అధికారులతో సీపీ సునీల్ దత్ మాట్లాడి.. బాధితుల సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి సత్వర న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. సమస్యల స్వభావాన్ని బట్టి చట్టప్రకారం స్పందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలని అధికారులను సీపీ ఆదేశించారు.

