కలం, ఖమ్మం బ్యూరో : సరిహద్దుల గుండా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ (Khammam CP) సునీల్ దత్ ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు. శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కల్లూరు డివిజన్ పోలీస్ అధికారులతో ఆయన ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ రవాణా నియంత్రణపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్లు, టిప్పర్లపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చట్టపరమైన కేసులు నమోదు చేసి తక్షణమే సీజ్ చేయాలని స్పష్టం చేశారు.
గంజాయి రవాణాను అడ్డుకోండి
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి రవాణాను పూర్తిగా అడ్డుకోవడానికి స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరంతరం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదల రేషన్ బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు లేదా స్థానిక మిల్లులకు తరలకుండా గోదాములు, రవాణా వాహనాలపై గట్టి నిఘా పెట్టాలన్నారు. రేషన్ బియ్యం, గంజాయి వంటి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠినమైన నాన్- బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు, పీడీ యాక్ట్ అమలు చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు.
పశువుల రవాణాపై నిఘా పెట్టండి
రాబోయే పండుగల సమయంలో చట్టవిరుద్ధంగా పశువుల రవాణా, వేధింపులు జరగకుండా జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, బోర్డర్ చెక్ పోస్టుల వద్ద అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజల్లో అవగాహన కల్పించడం ఎంతో కీలకమని, సమాజ శ్రేయస్సు కోరి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని సీపీ భరోసా ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఏసీపీలు వసుంధర యాదవ్, సాంబరాజు, ఇన్స్పెక్టర్లు శ్రీహరి, ముత్తులింగం, సర్వయ్యతో పాటు పలువురు సబ్-ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

