Mobile Popup Ad
Mobile Popup Ad

ఎస్ఐఆర్‌కు రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్

కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR Survey) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ (Khammam Collector) కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా రానున్న 30 రోజులలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, వాటిని తిరిగి సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. ఈ ప్రక్రియపై గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో టామ్‌ టామ్ (దండోరా) ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ సర్వే సమయంలో ఓటర్లు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండి తమ వివరాలను సక్రమంగా అందించాలని ఆయన కోరారు.

బీఎల్‌ఏల వివరాలు అందజేయాలి..

​జిల్లాలో గుర్తించిన ఎక్కువ శాతం అనామలీలను (లోపాలను) ఇప్పటికే పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అన్‌మ్యాప్డ్ ఓటర్లు నిర్దేశించిన 11 రకాల ధృవ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని, అవసరమైన పత్రాలు సమర్పించిన వారికి తక్కువ సమయంలోనే దరఖాస్తులను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కు కొనసాగేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల యంత్రాంగానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.​ రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్ల వివరాలను వెంటనే అందజేయాలని, ప్రతి బీఎల్‌ఏ తప్పనిసరిగా తమ రాజకీయ పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డును కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

బూత్ లెవల్ అధికారులు, బీఎల్‌ఏలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి సమస్యలు లేదా సందేహాలు ఉన్నా వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బీఎల్‌వోలకు సహాయక సిబ్బందిని కూడా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఎవరి పేరు లేకపోయినా తప్పనిసరిగా అభ్యంతరం నమోదు చేయాలని, లేనిపక్షంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

జిల్లా యంత్రాంగం సిద్ధం..

ఎస్‌ఐఆర్ కార్యక్రమం కోసం జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని, దీనికి ప్రజల, రాజకీయ పార్టీల సహకారం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ​ఈ సమీక్షా సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిటి అన్సారీ, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>