కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పలు జిల్లాల్లో అడవి జంతువులు (Wild Animals) జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రావడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ప్రకృతి విధ్వంసం, అడవిలో ఆహార కొరతతో తరచూ జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పులుల సంచారంతో జనం భయాందోళనకు గురవుతుంటే తాజాగా ఎలుగుబంట్లు (Bears), ఏనుగులు (Elephants) పంటలను ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది.
శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) జిల్లాలో ఎలుగుబంట్ల బెడద తీవ్రమవుతోంది. గుడిబండ మండలంలోని ఎస్ఎస్ గుండ్లు గ్రామంలో రాత్రి, పగలు తేడా లేకుండా ఎలుగుబంట్లు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి వస్తున్నాయి. తాజాగా బుధవారం కొన్ని ఎలుగు బంట్లు పంటలను ధ్వంసం చేస్తుండగా స్థానికులు వీడియోలు తీశారు. అరుస్తూ వాటిని కొండల్లోకి తరిమే ప్రయత్నం చేశారు. జనాల అరుపులకు అవి పారిపోయాయి. అయితే మళ్లీ తిరిగి వస్తున్నాయని రైతులు అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు పార్వతీపురం మన్యం (Parvathipuram Manyam) జిల్లాలో ప్రజలు ఏనుగుల గుంపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీతానగరం మండలంలో బుధవారం 8 ఏనుగులు మూకుమ్మడిగా పంటలపై దాడి చేశాయి. రైతులకు సంబంధించిన వరి నూర్పిడి యంత్రాలను ధ్వంసం చేశాయి. ఏనుగులు తరచూ జనావాసాల్లోకి వస్తుండటంతో అధికారులు రైతులు, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎలుగుబంట్లు, ఏనుగుల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అటవీ శాఖ అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.

