Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌ నినో (El Nino) భయం రైతులను వెంటాడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వర్షాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నీటి ఎద్దడిని తట్టుకునే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి పంట సాగు నష్టమని హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో, స్వల్ప కాలంలోనే పక్వానికి వచ్చే చిరుధాన్యాలు జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి తక్కువ వర్షపాతాన్ని, అధిక ఎండలను తట్టుకుని మంచి దిగుబడిని ఇస్తాయని అధికారులు చెప్తున్నారు. మార్కెట్‌లో కూడా వీటికి మంచి డిమాండ్ ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

చిరుధాన్యాలతోపాటు భూసారాన్ని పెంచే పప్పుధాన్యాలు, తక్కువ తడితో పండే నూనెగింజల సాగు రైతులకు ఆర్థిక భరోసానిస్తుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా కంది, పెసర, మినుము, అలసందలు (బొబ్బర్లు) లాంటి పప్పుధాన్యాల పంటలు, అలాగే వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), నువ్వులు వంటి నూనెగింజల పంటలు వర్షాభావ పరిస్థితుల్లో సాగుకు అనుకూలమైనవి. ఈ పంటల కాలపరిమితి తక్కువగా ఉండటమే కాకుండా, నేలలోని తేమను సమర్థవంతంగా వాడుకుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ‘రైతు వేదికల’ ద్వారా ప్రభుత్వం ఎల్‌ నినో (El Nino) పరిస్థితులను తట్టుకునే విత్తనాలను అందుబాటులో ఉంచుతోంది. రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని నష్టాల నుంచి గట్టెక్కాలని అధికారులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>