కలం, నకిరేకల్ : నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నూతన మండల, టౌన్ అధ్యక్షుల నియామక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు నియమితులైన నూతన అధ్యక్షులకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేతతో కలిసి నియామక పత్రాలను అందజేశారు.
నకిరేకల్ టౌన్ అధ్యక్షులుగా లింగాల వెంకన్న, కేతేపల్లి మండలం అధ్యక్షుడిగా ఎడ్ల ప్రవీణ్, కట్టంగూర్ మండలం సుంకరబోయిన వెంకన్న, నార్కట్‌పల్లి మండలం గాయం శ్యామ్ సుందర్ రెడ్డి, చిట్యాల మండలం జడల చిన్న మల్లయ్య, చిట్యాల టౌన్ ఎద్దులపూరి కృష్ణలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన సీనియర్ నాయకులను గౌరవించాలని, వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రతి మండలం, పట్టణంలో క్రమం తప్పకుండా పార్టీ సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలన్నారు.
పార్టీ కోసం నిజాయితీగా, క్రమశిక్షణతో కష్టపడే ప్రతి కార్యకర్తకూ భవిష్యత్తులో ఖచ్చితంగా గుర్తింపు, ప్రోత్సాహం ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న ఓట్ల సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. ఓటు అనేది ప్రజల ప్రాథమిక, మౌలిక హక్కు అని, ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో చెరువులు, కుంటలపై వేలాది అక్రమ నిర్మాణాలు జరిగాయని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. ప్రకృతి వనరులను ధ్వంసం చేసిన వారిపై, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

