కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో జూదం, కోడిపందేలపై పోలీసులు ఉక్కుపాదం (Cockfighting Raids) మోపుతున్నారు. వేర్వేరు ప్రాంతాలలో నిర్వహించిన మెరుపు దాడులలో కోడిపందేలు నిర్వహిస్తున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులకు సంబంధించి సీఐ సర్వయ్య సోమవారం వివరాలను వెల్లడించారు.
వి.ఎం బంజరా పోలీస్ స్టేషన్ పరిధిలోని తల్లపెంట గ్రామ శివారు నరసింహస్వామి చెరువు సమీపంలో, అలాగే వేంసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడవరం గ్రామ తండా సమీపంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
ఈ మేరకు అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో వి.ఎం. బంజారా పరిధిలో ముగ్గురు వ్యక్తులు, వేంసూరు పరిధిలో 8 మంది వ్యక్తులు మొత్తం కలిపి 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల రాకను గమనించిన మరికొందరు నిందితులు తమ మోటార్ సైకిళ్లను అక్కడే వదిలి పరారయ్యారు.
ఈ దాడుల్లో నిందితుల నుండి మొత్తం 6 కోడిపుంజులు, రూ. 4,680 నగదు, వివిధ కంపెనీలకు చెందిన 16 మోటార్ సైకిళ్లను (వి.ఎం. బంజారాలో 3, వేంసూరులో 13) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేంసూరు ఘటనలో పట్టుబడిన 8 మంది నిందితులలో చిట్టిమాది సత్యంబాబు, సింగిశాల వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి వంశీ, దార్ల వెంకటేశ్వరరావు, మూకర శ్రీనివాసరావు, బాణం రాజుబాబు, దానె శంకర్, షేక్ షాజిద్లపై కేసులు నమోదు చేశారు.
పట్టుబడిన నిందితులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. కోడిపందేలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేసి, పోలీసుల నివారణ చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

