ప్రజావాణిలో 58 వినతులు.. పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను (Prajavani Complaints) క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. మధుసూధన్ నాయక్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను సావధానంగా విని, ప్రతి ఫిర్యాదును పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ప్రజావాణి దరఖాస్తులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, వాటిలోని అంశాలను పూర్తిగా అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల, సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాలు, భూ సర్వే–రికార్డులు, గృహ నిర్మాణం, రవాణా, పోలీసు, గిరిజన అభివృద్ధి, విద్యుత్, విద్య, వైద్య ఆరోగ్యం, గనులు, అటవీ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 58 వినతులను అధికారులు స్వీకరించారు.

మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష

ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మండల ప్రత్యేక అధికారుల ప్రతి వారం నిర్వహించే క్షేత్రస్థాయి పర్యటన పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మండల ప్రత్యేక అధికారి వారంలో ఒక రోజు తప్పనిసరిగా గ్రామాల్లో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామపంచాయతీలను తనిఖీ చేయాలని సూచించారు. పర్యటించిన ప్రాంతాల పేర్లు, అక్కడ గుర్తించిన సమస్యలు సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారం కు బాధ్యత తో కృషి చేయాలని సూచించారు.

వారు పర్యటించిన వివరాలు టూర్ డైరీ కలెక్టరేట్ ఏ.ఓ .కు సమర్పించాలని అన్నారు, ప్రతి వారం పర్యటనల ఫొటోలు, వివరాలను మండల ప్రత్యేక అధికారుల వాట్సాప్ గ్రూపులో షేర్ ఆదేశించారు. పర్యటనల సందర్భంగా ముఖ్యంగా పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణను, ప్రహరీ గోడలు, ఆటస్థలాలు, తదితర అంశాలను పరిశీలించాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన సమస్యలను ఏమైనా గుర్తిస్తే వాటిని కూడా పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో గుర్తించిన ప్రతి సమస్యలను సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత ప్రత్యేక అధికారులదేనని పేర్కొన్నారు.

జిల్లాలో ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా నీరు, విద్యుత్ పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో నీటి లీకేజీలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, విద్యుత్ వృథాను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో పగలు కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయన్న ఫిర్యాదులపై స్పందిస్తూ, ఆటోమేటిక్ స్విచ్‌లు పనిచేయకపోతే మాన్యువల్ విధానంలోనైనా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టే పనులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేయాలని తెలిపారు.

భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో నీటి సంరక్షణ పనులకు బదులుగా మొక్కల పెంపకం, రహదారుల మరమ్మతులు వంటి అవసరమైన పనులను చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో పనుల జాబితాను పరిశీలించి, షెల్ఫ్‌లో ఉన్న పనుల వివరాలను తనకు అందజేయాలని ఆదేశించారు. కె జి. బి.వి పాఠశాలలో ఎక్కడైనా సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా కారణంగా మోటార్లు దెబ్బతింటున్నట్టు గుర్తిస్తే ఆ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చోట త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా కల్పించాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పై అందిస్తున్న విత్తనాల పంపిణీ పై రైతులకు విస్తృతంగా ప్రచారం కల్పించి, పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ, జెడ్.పి.సి.ఈ.ఓ, ఇన్‌చార్జి డి.పి.ఓ వెంకట్‌రెడ్డి, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ యాదగిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>