epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

వికసిత భారత్‌కు మోడీ గ్యారెంటీ : ఖ‌మ్మం బీజేపీ అధ్యక్షుడు కోటేశ్వరరావు

కలం, ఖమ్మం బ్యూరో: “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్(Budget) కేవలం ఆదాయ వ్యయాల చిట్టా కాదు.. ఇది 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ అగ్రరాజ్యంగా నిలబెట్టే ‘వికసిత భారత్’ మహాద్భుత రాజ్యాంగం. సబ్బండ వర్గాల ఆశల పల్లకిగా నిలిచిన ఈ బడ్జెట్, విపక్షాల నోళ్లు మూయించి దేశ ప్రజల మనసు గెలిచింది” అని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అభివర్ణించారు. ఆదివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బడ్జెట్ విశేషాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.

హైదరాబాద్ కేంద్రంగా ప్రగతి పరుగులు

ఈ బడ్జెట్(Budget) తెలుగు రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా తెలంగాణకు పెద్దపీట వేసిందని కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లలో.. పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాలు ఉండటం మన ప్రాంత అభివృద్ధిపై మోదీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఇది రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మారుస్తుందని జోస్యం చెప్పారు.

టెక్నాలజీకి పెద్దపీట – యువతకు ఉపాధి బాట

సాంకేతిక రంగంలో భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చేందుకు బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలు యువతకు వరప్రదాయనిగా మారాయని ఆయన పేర్కొన్నారు. సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0కు రూ.40 వేల కోట్లు, బయో ఫార్మా శక్తి పథకానికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా లక్షలాది హై-ఎండ్ ఉద్యోగాలు మన యువత తలుపు తట్టనున్నాయని తెలిపారు. అంతేకాకుండా, 2047 వరకు డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ‘టాక్స్ హాలిడే’ ప్రకటించడం ద్వారా డిజిటల్ విప్లవానికి కేంద్రం నాంది పలికిందన్నారు. క్లౌడ్ సేవల రంగంలో ఇది భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుందని విశ్లేషించారు.

మధ్యతరగతికి మోడీ అభయం – పన్నుల్లో భారీ ఊరట

మధ్యతరగతి ప్రజల కష్టాలను గుర్తించి, వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించే నిర్ణయాలను ఈ బడ్జెట్‌(Budget)లో ప్రకటించారని కోటేశ్వరరావు కొనియాడారు. ఎల్‌ఆర్‌ఎస్ కింద విదేశీ చదువులు, వైద్యం కోసం చేసే చెల్లింపులపై టీడీఎస్ ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం సామాన్యులకు భారీ ఊరటనిస్తుందన్నారు. అలాగే కొత్త ఆదాయపు పన్ను చట్టం ద్వారా సరళతరమైన విధానాలు తీసుకురావడం, చిన్న మదుపరుల ప్రయోజనం కోసం కంపెనీల బైబ్యాక్ విధానాలపై స్పష్టతనివ్వడం మోదీ సర్కార్ దార్శనికతకు అద్దం పడుతోందన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవం

దేశానికి వెన్నెముకైన రైతన్నను రాజును చేయడమే లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు భారీ కేటాయింపులు చేశారని ఆయన గుర్తుచేశారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, జీడిపప్పు, కోకో సాగుకు ప్రత్యేక ప్యాకేజీలు, పశుసంవర్ధక, మత్స్య శాఖలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందన్నారు. పవిత్ర మాఘపూర్ణిమ నాడు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రైతుల పాలిట అక్షయపాత్రగా మారిందని అభివర్ణించారు.

రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి

కేంద్రం ఇంత భారీ నిధులు, ప్రాజెక్టులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ విమర్శలు మాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నెల్లూరి కోటేశ్వరరావు హితవు పలికారు. టెక్స్‌టైల్ రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించిన నేపథ్యంలో, మన రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. పేదలు, మహిళలు, యువత, రైతులు అనే నాలుగు స్తంభాలపై నిర్మితమైన ఈ బడ్జెట్.. భారత్‌ను 7 శాతం వృద్ధిరేటుతో పరుగులు పెట్టిస్తోందని, ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించే లక్ష్యంతో ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోందని వివరించారు. చివరగా, ఇంతటి సాహసోపేతమైన, ప్రజాకర్షక బడ్జెట్‌ను అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఖమ్మం జిల్లా ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, దేశ ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు వక్కలంక సుబ్రమణ్యం , దొంగల సత్యనారాయణ , జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ కుమార్, వీరవెల్లి రాజేష్ గుప్తా, రజిని రెడ్డి, మేకల నాగేందర్, కందుల శ్రీకృష్ణ, కొణతం లక్ష్మీనారాయణ, యార్లగడ్డ రాఘవ రావు, బోయల వెంకట్, కోటమర్తి సుదర్శన్, ఫమ్మి అనిత, బోయినపల్లి సురేష్ , మణి, చెరుకుపల్లి వెంకటేశ్వర్లు, కోటమర్తి ఉపేందర్, పడేశబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>