కలం, వెబ్‌డెస్క్: దేశాన్ని ప్రపంచానికి బయోఫార్మా కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ‘బయోఫార్మా శక్తి’ని తీసుకొచ్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్ (Union Budget 2026) ను ఆమె ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వైద్యరంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా రాబోయే ఐదేళ్లలో దేశంలో బయోఫార్మా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ.10వేల కోట్లతో ‘బయోఫార్మా శక్తి’ని ఆమె ప్రకటించారు.
‘ప్రస్తుతం మధుమేహం, క్యాన్సర్ లాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (అసాంక్రమిక వ్యాధులు) ఎక్కువవుతున్నాయి. వీటిని సమర్థంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా తగిన సన్నద్ధత అవసరం. దీనికోసం తెచ్చిందే ‘బయోఫార్మా శక్తి’. ఫార్మాలో నాలెడ్జ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ద్వారా ఆరోగ్యాభివృద్ధి కోసం తయారుచేసిన ప్రణాళిక ఇది. దీనివల్ల లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల్లో పరిశోధన, తయారీ రంగాలకు ఊతం లభిస్తుంది’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
‘ఆరోగ్యపరంగా మెరుగైన జీవనానికి జీవవైద్య (బయోలాజికల్) ఔషధాలు కీలకం. ఈ మందులు అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలి. ఈ క్రమంలోనే భారత్‌ను గ్లోబల్ బయోఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రూ.పదివేల కోట్ల వ్యయంతో బడ్జెట్ (Union Budget 2026)లో ‘బయోఫార్మా శక్తి’ని ప్రతిపాదిస్తున్నాం’ అని మంత్రి తెలిపారు.
అలాగే, మూడు కొత్త జాతీయ ఔషధ విద్య, పరిశోధన సంస్థలు (NIPERs)లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న 7 నైపర్లను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా వెయ్యి గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్స్ కేంద్రాల నెట్‌వర్క్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) బలోపేతం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.


