epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తెలంగాణ పోలీస్​, ఫైర్​సర్వీస్​ డ్రైవర్ల నియామకంపై సుప్రీం కీలక తీర్పు

కలం, వెబ్​డెస్క్​: పోలీస్​, అగ్నిమాపక శాఖ విభాగాల్లో డ్రైవర్​ పోస్టులకు రెండేళ్ల నిరంతర డ్రైవింగ్​ లైసెన్స్​ ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైసెన్స్​ గడువు ముగిసిన తర్వాత ఒక్కరోజు విరామం ఉన్నా దాన్ని నిరంతర లైసెన్స్​గా పరిగణించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు పోలీస్​, ఫైర్​ సర్వీస్​ విభాగాల్లో డ్రైవర్​ పోస్టుల నియామకాల విషయంలో తెలంగాణ (Telangana) రాష్ట్ర పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు(టీఎస్​ఎల్​పీఆర్​బీ) తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. జస్టిస్​ ఆషానుద్దీన్​ అమానుల్లా, ఎస్​వీఎన్​ భట్టితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పునిచ్చింది. కేసు పూర్వాపరాలు ఇవీ.. రాష్ట్రంలోని పోలీస్​, ఫైర్​ సర్వీస్​ విభాగాల్లో 325 డ్రైవర్​, డ్రైవర్​ ఆపరేటర్ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్​ విడుదలైంది. అర్హత నిబంధనల్లో భాగంగా.. నోటిఫికేషన్​ వెలువడిన నాటి నుంచి కనీసం రెండేళ్ల పరిమితి కలిగిన ఎల్​ఎంవీ/హెచ్​ఎంవీ లైసెన్స్ అభ్యర్థులకు తప్పనిసరిగా ఉండాలని రిక్రూట్​మెంట్​ బోర్డు పేర్కొంది.

దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో తీర్పు వాళ్లకు అనుకూలంగా వచ్చింది. గడువు ముగిసిన తర్వాత రెన్యువల్​కు మధ్య విరామం ఉన్నా అది నిరంతర డ్రైవింగ్​ లైసెన్స్​గానే పరిగణించవచ్చని ఆ తీర్పు సందర్భంగా తెలంగాణ (Telangana) హైకోర్టు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టును రిక్రూట్​మెంట్ బోర్డు​ ఆశ్రయించింది. విచారణ సందర్భంగా బోర్డు వాదనను సమర్థించిన సుప్రీం.. మోటార్​ వెహికల్స్​(సవరణ) చట్టం–2019 ప్రకారం గడువుతోనే పాత లైసెన్స్​ ముగుస్తుందని, తిరిగి రెన్యువల్​ చేసుకున్నప్పటికీ దాన్ని నిరంతర లైసెన్స్​గా పరిగణించలేమని పేర్కొంది. ఒక్క రోజు విరామం ఉన్నా అది నిబంధనను అతిక్రమించినట్లేనని తేల్చి చెప్పింది. బోర్డు నిబంధనల ప్రకారం అలాంటి అభ్యర్థులు పోలీస్​, అగ్నిమాపక విభాగాల డ్రైవర్ పోస్టులకు అర్హులు కాదని తీర్పునిచ్చింది. ​

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>