కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రహదారుల రూపురేఖలను మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. అసెంబ్లీ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) కీలక ప్రకటన చేస్తూ, రాబోయే మూడేళ్లలో సుమారు 70 వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యమని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేస్తూ ఈ పనులు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
హైదరాబాద్ – విజయవాడ హైవే విస్తరణపై మంత్రి స్పష్టతనిచ్చారు. 10,410 కోట్ల రూపాయల వ్యయంతో ప్రస్తుతం ఉన్న రహదారిని 6 లైన్ల మెయిన్ రోడ్డుగా, దానికి అదనంగా 2 లైన్ల సర్వీస్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. మే మొదటి వారంలో డీపీఆర్ ప్రక్రియ ముగించి టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రయాణ సమయం కేవలం 3 గంటల లోపు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
మరో భారీ ప్రాజెక్టుగా మన్ననూర్ – శ్రీశైలం మధ్య దేశంలోనే అతిపెద్ద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. శ్రీశైలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా 52 కిలోమీటర్ల మేర 7,600 కోట్ల రూపాయలతో ఈ కారిడార్ నిర్మించనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి దీనికి అవసరమైన కీలక అనుమతులను కూడా సాధించినట్లు మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) సభకు వివరించారు.

