కలం, వెబ్ డెస్క్: ది కేరళ స్టోరీ 2 సినిమా మేకర్స్‌కు గుడ్ న్యూస్(The Kerala Story 2). ఈ మూవీ విడుదలపై ఉన్న తాత్కాలిక స్టేను కోర్టు ఎత్తివేసింది. దీంతో ఈ చిత్రం విడుదలకు రూట్ క్లియరైంది. ఫిబ్రవరి 27 రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆగిపోగా, ప్రస్తుత తీర్పుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
కేరళను తప్పుగా చిత్రీకరించారని.. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ సినిమాలో డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ బి.కురియన్ జోసెఫ్ సారథ్యంలోని సింగిల్ జడ్జి బెంచ్ గురువారం తీర్పు చెబుతూ.. సీబీఎఫ్సీ తీరును తప్పుపట్టింది. అలాగే సినిమా విడుదలపై రెండు వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది.దీనిపై అదే రోజు సినిమా నిర్మాతలు డివిజన్ బెంబ్ను ఆశ్రయించారు.
ఈ క్రమంలో జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ పీవీ బాలకృష్ణన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పు ప్రకటించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను రద్దు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఎఫ్సీ అన్ని అంశాలూ పరిశీలించిన తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చిందని, ఒకవేళ మూవీ కారణంగా సమస్యలు తలెత్తితే.. వాటిని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
కాగా, బలవంతపు మతమార్పిడిలు, లవ్ జిహాద్ వంటి అంశాలతో సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ మొదటి భాగం సైతం తొలుత ఇలాగే వివాదాల్లో చిక్కుకుంది. అనంతరం అడ్డంకులు పూర్తి చేసుకొని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో దీనికి కొనసాగింపుగా నిర్మించిన చిత్రమే ‘ది కేరళ స్టోరీ 2’(The Kerala Story 2).
లవ్ జిహాద్, మత మార్పిడిల సమస్యలను ఎదుర్కొన్న కొన్ని నిజ జీవిత సంఘటనలను ఇందులో చూపించినట్లు నిర్మాత విపుల్ అమృత్లాల్ షా, దర్శకుడు కామాఖ్య నారాయణ సింగ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అనంతరం మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆ వెంటనే దీనిపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో అడ్డంకులన్నీ తొలగడంతో త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Read Also : శుభ్‌మన్ గిల్ నుంచి ఎంతో నేర్చుకున్నా
Follow Us On: Instagram

