కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుషమైన ఘటన వెలుగుచూసింది. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారిన ఒక 13 ఏళ్ల మైనర్ బాలిక (Keesara Minor Girl)పై, ఆమెకు రక్షణగా ఉండాల్సిన మేనమామ, వరుసకు సోదరులయ్యే ఇద్దరు యువకులు కలిసి గంజాయి మత్తులో సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. స్థానిక వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు కోల్పోయిన ఆ బాలిక కీసరలోని తన అమ్మమ్మ వద్ద ఆశ్రయం పొందింది. ఆ తర్వాత స్థానికులు, దాతల సహాయంతో ఆ చిన్నారిని తుర్కపల్లిలోని ఒక వసతి గృహంలో చేర్పించారు.
ఇటీవల పాఠశాలకు సెలవులు కావడంతో, బాలిక హాస్టల్ నుండి కీసరలోని అమ్మమ్మ ఇంటికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న ఆమె మేనమామ, మరో ఇద్దరు వరుసకు సోదరులయ్యే యువకులు గంజాయి మత్తులో బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘోరం బయటకు రాకుండా ఉండేందుకు నిందితులు బాలికను భయభ్రాంతులకు గురిచేశారు. ఆ తర్వాత సెలవులు ముగియడంతో బాలిక తిరిగి తుర్కపల్లిలోని వసతి గృహానికి చేరుకుంది. అయితే, అక్కడ ప్రమాదవశాత్తూ ఫ్యాన్ తగిలి బాలికకు గాయాలు కావడంతో, హాస్టల్ నిర్వాహకులు ఆమెను తిరిగి కీసరలోని అమ్మమ్మ వద్దకు పంపించారు.
ఒంటిపై గాయాలు, బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన అమ్మమ్మ గట్టిగా నిలదీయడంతో, నిందితులు చేసిన ఈ దారుణమైన లైంగిక దాడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా, పరారైన మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

