కలం, ఖమ్మం బ్యూరో: బాల్య వివాహాలు జరిపించినా, వాటికి ప్రోత్సాహం అందించినా కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష తప్పదని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Khammam CP ) మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు, విద్య, ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వివాహాలను ప్రోత్సహించరాదని ఆయన తేల్చిచెప్పారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని జిల్లా వ్యాప్తంగా ఎనిమిది బాల్య వివాహాలను విజయవంతంగా నిలిపివేశారని సీపీ తెలిపారు. కూసుమంచి మండలం బోటిమీడి తండా, తల్లాడ మండలం అన్నారుగూడెం, వైరా మండలం తాటిపూడి, గన్నవరం, సత్తుపల్లి మండలం బేతుపల్లి, కామేపల్లి మండలం బాసిత్ నగర్, బోనకల్ మండలం పెద్దబీరవల్లితో పాటు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న వివాహాలను పోలీసులు అడ్డుకున్నారని వివరించారు. ఈ క్రమంలో బాల్య వివాహాలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 12 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో బాల్య వివాహాల నివారణకు తల్లిదండ్రులు, ప్రజలు, ఉపాధ్యాయులు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కోరారు.

