కలం, వెబ్ డెస్క్: తొలిఏకాదశి (Tholi Ekadashi) పర్వదినం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలతోపాటు గ్రామాల్లోని శైవ, వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా తొలిఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర, శ్రీ సీతారామ, శ్రీ లాక్షినరసింహ స్వామి వార్ల దేవాలయాలకు భక్తులు విశేషంగా చేరుకొని స్వామివారికి పూజలు చేస్తున్నారు. విష్ణుమూర్తి యోగనిద్రకు ఉపక్రమించే రోజు కావడంతో తొలిఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉపవాసం ఉండి స్వామివారిని కీర్తిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల, భద్రాచలం దేవాలయాల్లో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఆది సెలవు దినం కూడా రావడంతో పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ..
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పర్వదినాన శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులతోపాటు ఆయా రాష్ట్రాల భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో బయట ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ముందస్తు ప్రణాళికతో తిరుమలకు రావాలని సూచించారు.
శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..
శుక్రవారం మొత్తం 78,721 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. వీరిలో 38,018 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.98 కోట్లుగా నమోదైంది. అటు మరమ్మతుల సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు అంటే 40 రోజులపాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. రాష్ట్రంలోని శ్రీశైలం, మంగళగిరి పానకాల నరసింహస్వామి, సింహాచలం, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం సత్యనారాయణ స్వామి, అహోబిల నవనరహింహస్వామి, త్రికూటేశ్వరం, ఏలూరు చిన్నతిరుపతి, పంచారామ క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి.
తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ..
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ, కరీంనగర్ వెంకటేశ్వర స్వామి, ధర్మపురి దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు కిక్కిరిపోవడంతో ఆలయ గిరులు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. కొండగట్టు, నాంపెల్లి, అగ్రహారం, కాళేశ్వరం, స్వర్ణగిరి, వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి దేవాలయం, చిలుకూరి బాలాజీ, పనగల్ ఛాయా సోమేశ్వర ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. “ఓం నమో నారాయణాయ” మంత్రంతో స్వామివారిని కీర్తిస్తున్నారు.
ఆంతర్యం ఇదే..
శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఈరోజునే ఉపక్రమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీహరి నిద్రలోకి వెళ్లే ఈ రోజు నుంచే నాలుగు నెలల పాటు చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. స్వామివారిని నిద్రకు సాగనంపుతూ భక్తి ప్రపత్తులతో వేడుకుంటూ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తారు. మరుసటి ద్వాదశి రోజున ఉపవాసం విరమిస్తారు. ఈరోజున “ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి | తన్నో విష్ణుః ప్రచోదయాత్” అనే మంత్రాన్ని నిరంతరం పఠించడంతో విష్ణుప్రీతి పొందగలరని పురాణాలు చెబుతున్నాయి.

