కలం, వెబ్ డెస్క్: రేపు జగిత్యాలలో కేసీఆర్ (KCR) ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభ జరుగనుంది. చాలా కాలం తరువాత కేసీఆర్ ప్రజల్లోకి రానుండడంతో సభపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ లో నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం కలిగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దశాబ్దాల రాజకీయ జీవితం గడిపిన జీవన్ రెడ్డిని గౌరవించేందుకు తనకు సమానమైన నాయకుడైన కేసీఆర్ తోనే పార్టీలోకి ఆహ్వానించేలా బీఆర్ఎస్ భారీ సభకు శ్రీకారం చుట్టింది. ఇక చాలా కాలం తరువాత నోరు మెదపని కేసీఆర్ సైతం.. రేవంత్ పాలనా వైఫల్యాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులపై ప్రసంగించనున్నారు. జగిత్యాల సభనుంచే పార్టీ జైత్రయాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ఇదివరకే కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ పాలన సైతం రెండున్నర సంవత్సరాలు గడుస్తుండటంతో గులాబీ బాస్ గళం విప్పనున్నారు. రేవంత్ ప్రభుత్వ తీరు, రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ చేయనున్న వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. అయితే కేసీఆర్ సభకు లక్ష మందికి పైగా జనాన్ని తరలించేలా ఏర్పాట్లు అధిష్టానం ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టి సభ నిర్వహణ సజావుగా జరిగేలా కేటీఆర్, హరీశ్ రావు దృష్టి సారించారు.
ఇందులో భాగంగానే ముందస్తుగా శనివారం జగిత్యాల పట్టణానికి కేటీఆర్, హరీశ్ రావు చేరుకొని సభా స్థలాన్ని పరిశీలించారు. కేసీఆర్ వస్తుండటంతో బీఆర్ఎస్ ఫ్లెక్సీలతో జగిత్యాల పట్టణం గులాబీమయమైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కోసం గులాబీ శ్రేణులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాయి. గ్రామాల నుంచి అధికంగా జనసమీకరణ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం అపూర్వ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. 40 ఏళ్ళు శ్రమించినా తనకు నిరాశే మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో చేరనుండటంతో కొత్త ఉత్సాహంతో పనిచేయనున్నారు. బీఆర్ఎస్ లో సైతం రానున్న ఎన్నికల్లో ఉన్నత స్థానాన్ని కేటాయిస్తారని ఆశిస్తూ జగిత్యాలో సరికొత్త రాజకీయాన్ని చూపేందుకు ఆయన సమాయత్తం అవుతున్నారు.
తెలంగాణ గడ్డపై కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని ఇదివరకే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చితే ఈ రెండేళ్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలని ఆయన ఆకాంక్షించారు. బీఆర్ఎస్ లో చేరిక తరువాత.. కాంగ్రెస్ రాజకీయాలపై తనదైన వ్యూహాలతో విరుచుకుపడేందుకు జీవన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ భారీ సభ ద్వారా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ తన పట్టును మరోసారి నిరూపించుకోవాలని భావిస్తోంది. కేసీఆర్ ప్రసంగం తమలో సరికొత్త ఉత్సాహం నింపుతుందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

