కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వసతి గృహాలను కొత్తగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Karimnagar Collector) ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. సోమవారం రాత్రి కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వార్డెన్లు డిప్యూటీ వార్డెన్లు రీజినల్ కోఆర్డినేటర్లతో పాటు ఇతర సిబ్బందితో హాస్టళ్ల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రారంభమైన సంక్షేమవారం విజయవంతంపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీలక సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమవారాన్ని ప్రతి వసతి గృహంలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. తద్వారా వసతి గృహాల రూపురేఖలు మార్చాలని సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాల పనితీరు ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. లీకేజీ లేకుండా ఫ్లోరింగ్ చక్కగా ఉండేలా చూసుకోవాలన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వార్డెన్లు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. మండల స్థాయిలో మండలానికి ఒక అధికారిని సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు నియమిస్తున్నామని పేర్కొన్నారు. హాస్టల్ల పనితీరుపై ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీలు చేస్తారని కలెక్టర్ (Karimnagar Collector) తెలిపారు.
రాత్రి వేళల్లో హాస్టల్ వార్డెన్లు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు దోమల బెడద లేకుండా తలుపులు కిటికీలకు మెస్ డోర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్తుకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టాయిలెట్లకు డోర్లు లేని చోట వాటిని ఏర్పాటు చేయాలని ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బందితో క్లీనింగ్ చేయించాలన్నారు. వసతి గృహాల్లో సరైన కాంపౌండ్ వాల్ లేని చోట వెంటనే నిర్మించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి మెనూ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వము సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని జాగ్రత్తగా అధికారులు విధులు నిర్వర్తించాలని ఆమె సూచించారు.
విద్యార్థులకు సౌకర్యాలు వసతుల కల్పనలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యభద్రతకు పెద్దపీటవేయాలని సూచించారు. హాస్టల్ సిబ్బంది రాత్రివేళ అప్రమత్తంగా ఉంటూ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాలను అన్ని రకాలుగా సమస్యలు లేకుండా తీర్చిదిద్దాలని విద్యార్థుల ప్రగతికి మెట్లు వసతి గృహాలు అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సోషల్ వెల్ఫేర్ ఇంచార్జ్ డిడి తిరుపతిరావు, డిపిఓ జగదీశ్వర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, డిటిడివో సంగీత, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వార్డెన్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

